
సాక్షి, పశ్చిమగోదావరి : న్యాయం చేయాలంటూ వచ్చిన రైతుల పట్ల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దారుణంగా ప్రవర్తించారు. వారిని బూతులు తిడుతూ.. అక్రమ కేసుల సైతం పెట్టడానికి సిద్ధపడ్డారు. వివరాలు.. గురువారం వట్లూరు జన్మభూమి మీటింగ్‌కు చింతమనేని ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలంటూ ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై బూతు పురాణం ప్రారంభించారు.
సహనం కోల్పోయిన అన్నదాతలు సమస్యను పరిష్కరించకుండా తమను తిట్టడం సరికాదంటూ వాదనకు దిగారు. దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి సదరు రైతులపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు రైతుల మీద 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు కొఠారు రామచంద్ర రావు, కార్యకర్తలు ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కెళ్లి రైతులను పరామర్శించారు.