బాధితులతో మాట్లాడుతున్న కొఠారు అబ్బాయ చౌదరి
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రజలు ఛీ కొట్టినా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి బుద్ధి రాలేదు. మాజీగా మారినా తన రౌడీయిజాన్ని మానుకోవడం లేదు. గతంలో మాదిరిగానే మరో సారి చింతమనేని దళితులపై దాడి చేశాడు. పిన్నకడిమిలో దళితులకు చెందిన ప్రభుత్వ భూముల్లో చింతమనేని గత ఐదు సంవత్సరాలుగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కొందరు దళిత యువకులు ఇంటి నిర్మాణం కోసం ఎడ్ల బండి ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వారిపై దాడికి దిగాడు. తన అనుచరులు తప్ప వేరే వారు ఎవరూ ఇసుక తరలించడానికి వీలులేదన్నాడు. అంతటితో ఊరుకోక దళిత యువకులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించాడు.
విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చింతమనేనికి దళితులపై దాడులు కొత్తకాదని తెలిపారు. పిన్నకడిమిలో దళిత యువకులను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించిన చింతమనేనిపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. చంద్రబాబు రాజ్యంలో దళితులపై దాడులకు పాల్పడినప్పటికి చింతమనేనిపై చర్యలు శూన్యమన్నారు. కానీ జగనన్న రాజ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. దళితులు వైఎస్సార్ పార్టీకి వెన్నెముక అన్నారు. వైఎస్సార్ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే సహించమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment