
జైలుకెళ్లబోతున్న చంద్రబాబు
జగన్ నామస్మరణలో టీడీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
తెనాలి : ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయత్నించి దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే, ఫోనులో హామీనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైలుకు వె ళ్లబోతుంటే, ఆ పార్టీ మంత్రులు, నాయకులు సిగ్గులేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఇక్కడి ఎన్జీవో కళ్యాణమండపంలో పార్టీ పట్టణ మైనారిటీ విభాగం కార్యవర్గ ప్రమాణస్వీకార సభ లో ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు కొద్దిరోజులుగా జగన్ నామస్మరణ చేస్తున్నారని, ఎక్కడ ఏది జరిగినా జగన్‌కు ఆపాదిస్తున్నారని అన్నారు.
రూ.150 కోట్ల లంచాల డబ్బును పోగేసి రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పక్కా ప్లాను వేసిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికారని చెప్పారు. దీన్నుంచి దృష్టి మరల్చేందుకు తన ఫోను ట్యాపింగ్ చేశారంటూ ఢిల్లీ వెళ్లి అందరి కాళ్లూ పట్టుకున్నారన్నారు. మరోవైపు కేసీఆర్ తిట్ల దండకంతో ఏపీ ప్రజలను అవమానించారనీ, ఆయనను జగన్ సమర్ధిస్తున్నారని వ్యవసాయమంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వసలు మంత్రివేనా...ప్రజలను రెచ్చగొట్టొచ్చా? గాలి మాటలు మాట్లాడతావా? ’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనీ, రెచ్చగొడితే వారి పరిస్థితి ఏమిటన్నారు.
జైలుకు వెళ్లబోతూ జగన్‌పై నిందలేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఆధిపత్య పోరులో కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు కేసులోంచి తప్పుకోవటానికి ప్రజలను రెచ్చగొట్టటం క్షమార్హం కాదన్నారు. ఆనాడు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫ్లెక్సీలు కట్టించిన చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు ఎందుకు అంగీకరించటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబూ తదితరులు పాల్గొన్నారు.