* 5న కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ ధర్నా
* వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
* పార్టీ పటిష్టతకు కిందిస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు
* రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో మరో సారి పర్యటన
* టీడీపీ నేతల అక్రమాలపై చర్యలకు ఒత్తిడి తీసుకువస్తాం
సాక్షిప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్యం చేస్తున్న వంచనలకు వ్యతిరేకంగా వచ్చే నెల ఐదవ తేదీన గుంటూరు లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహణకు వైఎస్సార్ సీపీ సమాయత్తమవు తోంది. పార్టీని పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా కింది స్థాయి నుంచి కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించనున్న గ్రామాల్లో మరో సారి పర్యటనకు సిద్ధమవుతోంది.
* వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించి చేసిన సూచనల మేరకు పార్టీని సమాయత్తం చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.
* అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి ఆ తరువాత రుణమాఫీ చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
* పార్టీని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా కమిటీల నియామకానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు.
* రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ జరగనున్న గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నేతలు మరో మారు పర్యటించనున్నారు. అక్కడి రైతుల బాధలు తెలుసుకుంటూ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అన్ని వర్గాలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురానున్నారు.
* గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు టీడీపీ నేతలు, అనుచరుల అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వాటికి బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.
* టీడీపీ నేతల అండదండలతో జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు పెరిగాయని, వీటిని వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునేలా పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు.
బాబు వంచనపై నిరసన భేరికి సమాయత్తం
Published Fri, Nov 21 2014 1:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement