
నడుస్తానో లేదో వదిలిపెట్టి చూడండి
‘‘ముద్రగడ పద్మనాభంకు నడిచే ఉద్దేశం లేకనే అనుమతి కోసం దరఖాస్తు చేయడం లేదని ఓ పెద్దాయనతో సీఎం చంద్రబాబు చెప్పిం చారు.
సీఎం చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం సవాల్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ముద్రగడ పద్మనాభంకు నడిచే ఉద్దేశం లేకనే అనుమతి కోసం దరఖాస్తు చేయడం లేదని ఓ పెద్దాయనతో సీఎం చంద్రబాబు చెప్పిం చారు. నన్ను స్వేచ్ఛగా వదలండి. నేను నడుస్తానో లేదో చూడండి. నేను నడిస్తే ఆ పెద్దాయన పదవికి రాజీనామా చేయాలి. నడవకపోతే నేను ఉద్యమాన్ని వదిలేస్తా’’ అని కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.
తనను గృహ నిర్బంధంలో ఉంచారనే భావిస్తున్నానని చెప్పారు. ప్రాణాలు పోతున్నా తాను, తన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లబోమన్నారు. తన పాదయాత్ర రూట్ మ్యాప్ సీఎం చంద్రబాబుకు పంపానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర అనుమతి దరఖాస్తు నమూనాను ఇప్పిస్తే తాను కూడా అదే విధంగా దరఖాస్తు చేస్తానని తెలిపారు. చంద్రబాబుకో చట్టం... తమకో చట్టమా? అని నిలదీశారు. ముద్రగడ ఇంకా ఏం చెప్పారంటే...
బాబులాగా స్టేలు, బెయిళ్లు తెచ్చుకోను
‘‘నన్ను బెదిరిస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌కు వెళ్లాలని, లేదంటే తీహార్ జైలుకు పంపుతా రని కబురు పంపిస్తున్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే అరెస్టు చేయండి. ఈ నెల 14న 69 కేసుల్లో చార్జిషీట్ వేస్తున్నాం, 49 కేసుల్లో ముద్రగడే ముద్దాయి అన్నారు. ఏమైంది.. ఎందుకు తోక ముడిచారు. నా జాతి కోసం దేనికైనా సిద్ధం. ఉరిశిక్ష వేసినా అప్పీల్ కూడా చేసుకోను. మీలాగా స్టేలు, బెయిళ్లు తెచ్చుకోను’’. అని ముద్రగడ అన్నారు.