పుష్కరాలు.. ఎమ్మెల్సీ ఎన్నికలు
నిడదవోలు/ఏలూరు/ : కొవ్వూరు/చాగల్లు :పుష్కరాలు, ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ లు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆదేశిం చారు. నిడదవోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఉదయం వారితో భేటీ అయ్యారు. అధికారులను, విలేకరులను లోనికి అనుమతించలేదు. అందిన సమాచారం ప్రకా రం.. గతంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై తొలుత ముఖ్యమంత్రి ఆరా తీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తగా హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పను నియమిం చినట్టు తెలిసింది.
నిడదవోలులో పాదయాత్ర, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆది వారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంత రం ముఖ్యమంత్రి ఇక్కడే బస చేశారు. సోమవారం ఉదయం 10.35 గంటలకు ప్రజాప్రతినిధులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. పుష్కరాలపై గంటకు పైగా సమీక్షించినట్టు భోగట్టా. ఉద యం 11.45 గంగలకు చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం వెళ్లారు. సమీక్ష సమావేశంలో ఎంపీ మాగం టి మురళీమోహన్, రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, గన్ని వీరాం జనేయులు, జి.బుచ్చియ్యచౌదరి, ఎమ్మెల్సీలు కలి దిండి రవివర్మ, చైతన్యరాజు, అంగర రామ్మెహన్, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
చప్పగా సాగిన రెండో రోజు పర్యటన
ముఖ్యమంత్రి సోమవారం నిర్వహించిన పర్యటన చప్పగా సాగింది. తొలిరోజు పర్యటనలో నిడదవోలు నియోజకవర్గంలో హామీలు గుప్పించిన సీఎం రెండో రోజు ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి తమ గ్రామాల అభివృద్ధికి నిధులిస్తారని, వరాలు కురిపిస్తారని ఆశపడిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు నిరాశే మిగిలింది. రెండోరోజు పర్యటన కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమైంది.
మురుగుదొడ్లు లేనోళ్లు మనుషులే కాదు
మరుగుదొడ్లు లేనివాళ్లు మనుషులే కాదని.. వాటిని కట్టుకోకపోతే మనుషులకు, జంతువులకు తేడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యా ఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి కారులో బ్రాహ్మణగూడెం చేరుకున్న ఆయన పంచాయతీ కార్యాలయం సమీపంలో గారపాటి రామారావు అందించిన రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం మొయిన్ రోడ్డులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో ఇంకా 30 మందికి మరుగుదొడ్లు లేవని, నూరు శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సీఎం సూచించారు. పల్లెల్ని స్మార్ట్ విలేజ్‌గా మార్చడానికి ఎన్‌ఆర్‌ఐలు, ధనవంతులు కొంతమేర నిధులు వెచ్చించాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సాగులో ఆధునిక పద్ధతులు తీసుకొస్తామన్నారు. గ్రామానికి చెందిన దాపర్తి సత్యనారాయణ మనుమడు విహాన్‌బాలు రూ.25 వేలను రాజధాని నిర్మాణం కోసం అందజేశారు.
ఎస్.ముప్పవరంలో స్ధానికులు కొందరు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కి అడ్డువెళ్లి ఊర చెరువు కొందరు వ్యక్తుల చేతుల్లో ఉందని, దాన్ని పంచాయతీకి అప్పగించి ఆదాయ వనరుగా మార్చాలని కోరారు. గ్రామానికి చెందిన సత్యసాయి సమితి ప్రతినిధి గారపాటి కృష్ణమూర్తి చెరువు అభివృద్ధికి రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించారు. అనంతరం చాగల్లు చేరుకున్న చంద్రబాబు ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో నాలుగు వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరించిన నాదెండ్ల శ్రీరామ్‌చౌదరిని అభినందించారు. రాజధాని నిర్మాణానికి వేములపల్లి హ ర్షిణి తాను సొమ్ము దాచుకున్న డిబ్బీని చంద్రబాబుకి అందజేసింది.
అనంతరం ఊనగట్లలో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ వెళ్లారు. ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బండారు మాధవ నాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, మొడియం శ్రీనివాస్, వేటుకూరి శివ, కలెక్టర్ కె.భాస్కర్, పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, చాగల్లు జెడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, ఆళ్ల హరిబాబు, గారపాటి కాశీవిశ్వనాథం, సూరపనేని చిన్ని, ఎంపీపీ కోడూరి రమామణి, గారపాటి శ్రీదేవి, దుద్దుపూడి రాజారమేష్, నందిగం శ్రీను పాల్గొన్నారు.