సీఎం ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నడు | cm kiran kumar reddy behaving like factionist | Sakshi
Sakshi News home page

సీఎం ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నడు

Published Fri, Sep 6 2013 5:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM

cm kiran kumar reddy  behaving like factionist

 ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తున్నారని, హింసను ప్రేరేపిస్తున్నారని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. సీమాంధ్రులకు తెలంగాణను పాలించే హక్కులేదన్నారు.  ముల్కీ వారోత్సవాల్లో భాగంగా హన్మకొండలోని కాళోజీ సెంటర్‌లో టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన మహాదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తాము ఏనాడూ హింసకు పాల్పడలేదన్నారు. తమపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. ఏడో తేదీన ఏపీఎన్‌జీవోస్ జరుపుతున్న సభ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద దాడి చేయడమేనన్నారు. మద్రాసు నుంచి తరిమికొట్టినట్టే హైదరాబాద్ నుంచి తరమికొట్టే రోజులు తీసుకురావద్దని సూచించారు.  తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిస్తే తన చేతిలో ఏమీ లేదని... అంతా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రం చేతుల్లో ఉందని చట్టసభలోనే చెప్పారని గుర్తు చేశారు. తీరా సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు.
 
  సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందని మాట్లాడుతున్నారని, తెలంగాణలో చేసేది అధర్మ యుద్ధమా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు  ఏం మాట్లాడుతున్నారో... అయనకే తెలియడం లేదని విమర్శించారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నిరోజులైనా సీమాంధ్ర ప్రాంతం వారు.. వారి స్వస్థలంకు వెళ్లాల్సిందేనన్నారు. సాగరహారంకు అనుమతివ్వాలని 30 మంది ఎమ్మెల్యేలం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లామని, రేపు రాత్రి ఉందనగా అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు.  దీక్షలో తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి, నున్నా అప్పారావు, సదానందం, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, పాపిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్‌రావు, బొట్ల బిక్షపతి, పరిటాల సుబ్బారావు,  కోల రాజేశ్‌కుమార్, ఎ.జగన్‌మోహన్‌రావు, ఈగ వెంకటేశ్వర్లు, రాంకిషన్, వీరాచారి, రత్నాకర్‌రెడ్డి, శ్యాంసుందర్, దాస్యనాయక్, షేక్ హుస్సేన్, ఆర్ శ్రీనివాస్, పి.విజయలక్ష్మి, బి.రాము, ధరంసింగ్, కేవీ.నరేందర్, కె.సామ్యూల్, కంతి రమేష్ పాల్గొన్నారు.
 
 ఇక్కడి ప్రజలు సమైక్యాన్ని
 కోరుకుంటలేరు
 రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్టేడియంలో క్రీడలకు, క్రీడాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ జీఓ ఉన్నా... దాన్ని కాలరాస్తూ ఏపీఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇస్తారు.
 - దేవీప్రసాద్, టీఎన్‌జీవోస్ యూనియన్
 రాష్ట్ర అధ్యక్షుడు
 బాబు, కిరణ్ అడ్డుకుంటున్నరు
 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నరు. సీమాం ధ్రులకు తెలంగాణను పాలించే హక్కు లేదు. సీమాంధ్రుల కుట్రలను తిప్పి కొడతాం. తెలంగాణ ప్రజలకు శాంతి దీక్షలు తెలుసు..సమరాలు తెలుసు.
 -పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్
 ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నరు
 రాష్ట్ర విభజన ప్రక్రియ ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుని నెల రోజులు గడుస్తున్నా... కేంద్రం ముందుకు పోవడం లేదు. దీంతో ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉంది. యూపీఏ ప్రభుత్వం ఇవ్వకున్నా, ఆ తరువాత అధికారంలోకి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుంది. ఇప్పటికే తెలంగాణపై నరేంద్ర మోడీచే హైదరాబాద్‌లో సభ నిర్వహించాం. త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాలి.
 - నరహరి వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి
 
 టీడీపీ గద్దెలు కూలుతయ్...
 తెలంగాణలో టీడీపీ గద్దెలు కూలుతయ్. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ నమ్మబలికి చంద్రబాబు తెలంగాణకు మోసం చేశారు. బాబు చేపట్టిన సమైక్య బస్సు యాత్ర, నిర్ణయంపై చెంచాగిరి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏం సమాధానం చెబుతరు. తెలంగాణను దోచుకున్న వారికి అనుమతిచ్చిండ్రు. మేము హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తామంటే అనుమతియ్యలె. పైగా అనేక ఇబ్బందులు పెట్టిండ్రు. తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తున్నా సహనంతో ఉంటున్నాం. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో వెళ్తున్నం. ఏపీఎన్జీవోలు సభ జరుపుకుంటే స్టేడియంలో ఉన్న తెలంగాణ తేల్లు, పాములు, కుక్కలు కరుస్తాయి.
 - దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే
 
 కల్లోలం సృష్టించాలని చూస్తున్నరు
 ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించాలని సీమాంధ్రుల నేతృత్వంలో ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వారికి ఇచ్చిన అనుమతి రద్దుచేయాలి. తెలంగాణ ప్రక్రియ వేగవంతమవుతున్న క్రమంలో సమైక్యవాదం అంటూ సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు బుసలు కొడుతున్నరు. కూతురి వివాహానికి సినీ నటుడు బాలకృష్ణ  తన సోదరుడు హరికృష్ణనే పిలువలేదు. ు కుటుంబమే కలసి ఉండనప్పుడు భయపెట్టి బలవంతంగా ఉండాలంటే ఎలా కలిసి ఉంటాం. పోలీసులు అత్యుత్సాహం చూపి అనుమతిచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమకారులపై అక్రమ కేసులు, రౌడీషీట్లను ఎత్తేయాలి. ఏడో తేదీన జరిగే శాంతి ర్యాలీకి రెండు రోజుల ముందుగానే చేరుకోవాలి. తెలంగాణ ఉద్యమకారులను వేదించిన అధికారులను, పోలీసులను రాష్ట్రం ఏర్పడ్డాక వదిలిపెట్టం.
 - శ్రీనివాస్‌గౌడ్ , తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 
 కేంద్ర పాలితం చేస్తే ఊరుకోం
 హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేస్తే ఊరుకునేది లేదు. హైదరాబాద్ సహా 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలిచి ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇప్పించిండు.  టీఎన్జీవోస్ దీక్షకు 10 రోజుల కిందట అనుమతి కోరితే ఇవ్వలేదు. హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని కుట్రలు చేస్తున్నరు.
 - కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement