ఆంక్షలు పెడితే ఊరుకోం | Formation of telangana is almost over said kodandaram | Sakshi
Sakshi News home page

ఆంక్షలు పెడితే ఊరుకోం

Published Tue, Nov 19 2013 6:02 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Formation of telangana is almost over said kodandaram

మక్తల్, న్యూస్‌లైన్:  హైదరాబాద్‌పై ఆంక్షలు, భద్రాచలం డివిజన్‌పై మెలికలు పెట్టి ఆంధ్రాలో కలపాలని భావించి విభజనకు అడ్డంకులు సృష్టిస్తే  ఊరుకునేది లేదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హెచ్చరించారు. ఆ రెండు ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు.  
 రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, సీమాంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకోవడానికి ఎత్తులువేయడం సరికాదన్నారు. ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు శాంతియుతంగా సహకరించాలని కోరారు. సోమవారం మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్ ఆవరణలో ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర నాయకుల వివక్షకు గురయ్యారని, విద్యావైద్యం, తాగునీరు, అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయారని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా నిధులు, మా ఉద్యోగాలు, మా నీళ్లు మాకే దక్కాలన్నారు. సంపూర్ణ తెలంగాణ సాధించుకోవడానికి నాయకులు కృషిచేయాలని కోరారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ఎద్దేవాచేశారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా 13 జిల్లా ప్రజల గురించే మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతప్రజల గురించి మాట్లాడకపోయినా ఫరవాలేదని, అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ పండుగ ఇంకా మొదలుకాలేదని, పార్లమెంట్‌లో బిల్లు పాసైన తరువాత సంబరాలు జరుపుకోవాలని కోరారు.
 పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా కల్పించాలి
 సమైక్యపాలనలో తెలంగాణలోని పాలమూరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కోదండరామ్ అన్నారు. విశాలాంధ్రలో కలపడం వల్ల కృష్టాజలాల సమస్య ఏర్పడిందన్నారు. అప్పట్లో కృష్ణానదిపై ఎగువ కృష్ణ, భీమానదిపై భీమా ప్రాజెక్టులను నిర్మించాలని నిజాం పాలనలోనే ప్రతిపాదనలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు కర్ణాటకలోకి వెళ్లాయన్నారు. నెహ్రూ సూచనల మేరకు బచావత్ ట్రిబ్యూనల్ కమిటీ జిల్లాను సందర్శించి జూరాల ప్రాజెక్టును ఏర్పాటుచేసిందన్నారు. ఇప్పటికీ జూరాల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీటిని ఉపయోగించుకోవడం లేదన్నారు. 18టీఎంసీల నీటిని కేటాయించగా ఆరు టీఎంసీల నీరు మాత్రమే నిల్వచేస్తున్నామని ఇది ఈ ప్రాంత నాయకుల అలసత్వమే అన్నారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పించేందుకు పార్టీలకతీతంగా నాయకులు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో టీజేఏసీ కోకన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి, మక్తల్ నియోజకవర్గం చైర్మన్ సూర్యప్రకాష్, ప్రజాసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ కన్వీనర్ నర్సింహులు, నాయకులు పోలప్ప, రవీందర్, కృష్ణారెడ్డి, మున్వర్‌అలీ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement