ఊరునుమారుద్దాం | CM YS Jagan comments in video conference with District Collectors and SPs | Sakshi
Sakshi News home page

ఊరునుమారుద్దాం

Published Wed, May 20 2020 4:10 AM | Last Updated on Wed, May 20 2020 8:13 AM

CM YS Jagan comments in video conference with District Collectors and SPs - Sakshi

ఎవరైనా గ్రామంలోకి అడుగుపెడితే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్, ఇంగ్లిష్‌లో బోధించే పాఠశాల, వచ్చే ఏడాది నుంచి జనతా బజార్‌ ఇవన్నీ కనిపిస్తాయి. చరిత్రలో ఎప్పుడూ కూడా గ్రామాల మీద ఇంతగా దృష్టి పెట్టలేదు. మొత్తం గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నాం. 

సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాల పంపిణీతో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏపీ చరిత్రలో మొదటి సారిగా రైతుల వద్దకే విత్తన పంపిణీని తీసుకెళ్లామని చెప్పారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్వరూపాన్నే మార్చి.. విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. స్పందన కార్యక్రమంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్, ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత, జాతీయ ఉపాధి హామీ పథకం, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ గ్రామ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, తాగునీరు.. వేసవిలో కార్యాచరణ ప్రణాళిక, పాఠశాలల్లో నాడు – నేడు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, మద్యంలో అక్రమాల నివారణ, జిల్లాకు ముగ్గురు జేసీలు, వారి విధులు తదితర అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

ఖరీఫ్‌ సన్నద్ధత 
► రైతు భరోసా కింద మే నెలలో దాదాపు రూ.2,800 కోట్లు ఇచ్చాం. అంతకు ముందు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ఏప్రిల్‌ నెలలో రూ.875 కోట్లు ఇచ్చాం. మొత్తంగా రూ.3,675 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఖరీఫ్‌ సన్నద్ధతలో భాగంగా మొట్ట మొదటి అడుగుగా మే 15న ఈ డబ్బులు ఇచ్చాం. 
► మే 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏపీ చరిత్రలో మొదటి సారిగా గ్రామ స్థాయిలో విత్తనాలను పంపిణీ చేశాం. 8.43 లక్షల క్వింటాళ్ల విత్తనాలను గ్రామాల్లో అందుబాటులో పెట్టాం. వరి, వేరు శనగ తదితర విత్తనాలను జిల్లాలకు పంపించాం. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి.  
► ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు విత్తన పంపిణీ కార్యక్రమం కొనసాగాలి. ఇందువల్ల రైతులకు ఎండ తీవ్రత ఉండదు.  
► జూన్‌ 1 నుంచి ఆర్‌బీకేల ద్వారా గ్రామాల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ముందుగానే గుర్తించాలి. గ్రామ సచివాలయాల స్థాయికి కూడా ఈ సమాచారం వెళ్లాలి. 
► 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇప్పటికే సిద్ధం చేశాం. మీ మీ జిల్లాల్లో ఎరువులకు సంబంధించి నిల్వలపై పర్యవేక్షించాలని కలెక్టర్లకు చెబుతున్నా. ప్రతి జిల్లాల్లో బఫర్‌ స్టాక్‌ ఉండాల్సిన అవసరం ఉంది.  రైల్వే స్టేషన్లలో ర్యాక్‌ మూవ్‌మెంట్‌పైనా కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కంటైన్‌మెంట్‌ జోన్ల వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిని కూడా అధిగమించేలా చూడాలి.  

అడ్వైజరీ బోర్డు సమావేశాలు తప్పనిసరి  
► ఇరిగేషన్‌ అడ్వైజరీ బోర్డు సమావేశమై నీళ్ల విడుదలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి. జిల్లా, మండల స్థాయిలో అగ్రికల్చర్‌ అడ్వైజరీ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. బుధవారానికి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయి.  
► ఆర్‌బీకే ద్వారా ఆ ఊళ్లో ఎలాంటి పంటలు వేయాలి? ఎలాంటి పంటలు వేస్తే ధరలు వస్తాయి? మార్కెటింగ్‌ ఉంటుంది? అన్నదానిపై అడ్వైజరీ బోర్డులు సలహాలు ఇస్తాయి. 
► రైతులకు రుణాలు అందేలా.. జిల్లా బ్యాంకర్ల సమావేశాలను కలెక్టర్లు వెంటనే నిర్వహించాలి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రుణాలు అందించాలి. రైతు భరోసాకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకోలేని ఖాతాల్లో వేశాం. వాళ్లు జమ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే.   

విలేజ్‌ క్లినిక్స్‌కు స్థలాలు గుర్తించాలి 
► గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్‌ క్లినిక్స్, ఆర్‌బీకేల భవనాల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటిపై రోజూ సమీక్ష నిర్వహించాలి.  
► జూన్‌ 15 నాటికి స్థలాల గుర్తింపు పూర్తి కావాలి. ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ను ఇందుకు పూర్తిగా వినియోగించుకోండి.  

తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు 
► రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. 3,021 ఆవాసాలకు 14,861 ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పశువులకు కూడా తాగునీరు అందిస్తున్నారు. 403 బోర్‌ వెల్స్‌ కూడా పని చేస్తున్నాయి.  
► పట్టణ ప్రాంతాల్లో 120 చోట్ల తాగునీటి కొరతను తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులన్నింటినీ కలెక్టర్లు పర్యవేక్షించాలి. తాగునీటికి కొరత ఉందనే మాట రాకూడదు. ఈ సమస్యపై ప్రతి రోజూ దృష్టి పెట్టాలి.   

ఇసుక, మద్యం అక్రమాలపై దృష్టి 
► వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలి. తప్పనిసరిగా నిల్వలు పెంచాలి. ఇందుకు సంబంధించి ప్రత్యేక జేసీని కూడా పెట్టాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలి. 
► మద్యం అక్రమాలకు చెక్‌ చెప్పడానికి యువ ఐపీఎస్‌ అధికారులను పెట్టాం. తొలిసారిగా మనం ఈ బాధ్యతలను పోలీసు విభాగానికి అప్పగించాం. ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేశాం. అక్రమంగా మద్యం తయారు కావడం, అక్రమంగా రవాణా చేయడం ఎక్కడా కనిపించకూడదు.  
► ఎస్పీలు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. అక్రమ ఇసుక, మద్యం వెనుక ఎవరున్నా కూడా ఖాతరు చేయడకూడదు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేసేలా చూడండి. చెక్‌పోస్టులు కూడా సరైన విధంగా పనిచేయాలి. ఇవన్నీ సక్రమంగా పని చేయించాల్సిన బాధ్యత జేసీలదే. 
► మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్‌ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. బెల్టుషాపులు, పర్మిట్‌ రూంలు ఎత్తివేశాం. మద్యం అమ్మే వేళలు కూడా తగ్గించాం. ఇంకా రేట్లు పెంచి.. ఇంకా దుకాణాలు తగ్గించి.. వినియోగాన్ని బాగా తగ్గించాం.   

ఇళ్ల స్థలాల పట్టాలు 
► మే 31లోగా భూ సేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడం తదితర అన్ని పనులు కూడా పూర్తి కావాలి. 99 శాతం భూ సేకరణ పూర్తయ్యింది. 90.8 శాతం లే అవుట్ల పని, మార్కింగ్‌ 80.09 శాతం పూర్తయ్యింది. 12,66,253 మంది లబ్ధిదారులకు లాటరీ కూడా పూర్తయ్యింది.  
► మే 31లోగా మిగిలిన పనులన్నీ పూర్తి కావాలి. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. అర్హత ఉండీ ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదు. ఎవరైనా మిగిలిపోతే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి మే 21 వరకు సమయం ఇచ్చాం. మే 30 కల్లా వెరిఫికేషన్‌ పూర్తి కావాలి. 
► ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్‌ 7న ప్రకటించాలి. అదనంగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ల్యాండ్‌ సమీకరణ, అభివృద్ధి జూన్‌ 30 నాటికి పూర్తి కావాలి. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశాం. పద్ధతి ప్రకారం అన్నీ జరిగేట్టుగా చూడాలని కలెక్టర్లను కోరుతున్నా.  

జిల్లాకు ముగ్గురు జేసీలు 
► ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. 
► పారదర్శకంగా.. సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. విలేజ్‌ క్లినిక్స్‌లో 24 గంటలూ ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. ఆశా కార్యకర్తలకు అదే రిపోర్టింగ్‌ పాయింట్‌ అవుతుంది. 
► గ్రామాల స్వరూపాన్ని మార్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర వహిస్తాయి. రైతులు ఉత్పత్తి చేసిన దాంట్లో కనీసం 30 శాతం స్థానిక మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడానికి జనతా బజార్లను ఏర్పాటు చేస్తున్నాం.  
► జేసీలందరి పనితీరుపై మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. మీరంతా యువ ఐఏఎస్‌ అధికారులు. మీరు బాగా పని చేస్తే.. మంచి ఎలివేషన్‌ పొందుతారు. నాకు ఓటు వేయని వారు అయినా పర్వాలేదు.. అర్హత ఉంటే పథకాలు అందాలని చెబుతున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతా«ధికారులు పాల్గొన్నారు.  

వలస కూలీలందరికీ ఉపాధి కల్పించాలి 
► కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్‌ కార్డులు ఇవ్వాలి.   
► ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్యను ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు చేయాల్సి ఉంది.  

విత్తన పంపిణీలో సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోండి. జిల్లాల్లో ఎక్కడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు కనిపించకూడదు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కారణంగా నష్టపోతున్నామనే మాట వినిపించకూడదు. ఈ విషయంలో అధికారులు దూకుడుగా ఉండాలని కోరుతున్నా. కలెక్టర్లు, ఎస్పీలు సీరియస్‌గా తీసుకోవాలి.  

మద్యం నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. పక్క రాష్ట్రాల్లో మద్యాన్ని ఎలా తాగించాలని చూస్తున్నారు. మనం మద్యాన్ని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాం. లిక్కర్, శాండ్‌ మీద కొందరు యువ ఐపీఎస్‌లను పెట్టాం. నిజాయితీగా పని చేయాలి. తప్పు చేస్తే ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన పని లేదు. దీన్ని ఎలా డీల్‌ చేస్తామన్న విషయం మీద రాష్ట్రం, దేశం మనవైపు చూస్తున్నాయి.  

30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం 
ఈ నెల 30వ తేదీన 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 
27న రైతు భరోసా కేంద్రాలపై డ్రైరన్‌ నిర్వహించాలి. ఆర్‌బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం.  
► గ్రామంలో ఒక రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే.. అదే గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రతిరోజూ పంపిస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెటింగ్‌ శాఖ యాక్టివ్‌ అవుతుంది. ఆర్‌బీకేలను చూస్తున్న జేసీ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు.. కలెక్టర్‌ మార్గదర్శకాలతో రైతుకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. 
► ఆర్‌బీకేల ద్వారా ఇ క్రాపింగ్‌ జరుగుతుంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్‌బీకేల ద్వారా లభ్యం అవుతాయి.   
► ఆధార్‌ సీడింగ్‌ కారణంగా రైతు భరోసా డబ్బులు అందని 4 శాతం రైతులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.   

ఈ నెల 30న 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 27న రైతు భరోసా కేంద్రాలపై డ్రై రన్‌ నిర్వహించాలి. ఆర్‌బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం. 

ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలందించాలి.

కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్‌ కార్డులు ఇవ్వాలి.   

రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. అవసరమైన చోట  ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. 

గతంలో విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. మండు టెండలో పెద్ద క్యూలో రైతులు  నిలబడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి రైతుకూ టోకెన్లు ఇచ్చి గ్రామ స్థాయిలోనే పంపిణీ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఎక్కడా గుమిగూడాల్సిన అవసరం లేదు. రైతులకు కూపన్లు ఇచ్చే వ్యవస్థను కలెక్టర్లు పర్యవేక్షించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement