సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా చికిత్స, దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కోవిడ్ –19 టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్‌ను నిర్ధారించి, మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించొచ్చు. మరోవైపు రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో తెలిపారు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల్లోని 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రాయితీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. దీనిపై రెండు మూడు రోజుల్లో నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ...
85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం చేయవచ్చు. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్ద వాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం చేయకూడదు.
► టెలి మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా? లేదా? పర్యవేక్షించాలి. వైద్య రంగంలో చేపట్టనున్న నాడు– నేడు కార్యక్రమాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఇవి పూర్తి అయితే కోవిడ్ లాంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కోగలం.
ఏం చేయాలో చెప్పాలి...
► కోవిడ్‌పై ప్రజల్లో మరింత అవగాహన కలిగేలా ఉద్ధృతంగా ప్రచారం చేయాలి.
కోవిడ్ సోకిందన్న అనుమానం కలిగితే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలనే అంశంపై విస్తృత ప్రచారం చేపట్టాలి. కోవిడ్ ఎవరికైనా రావచ్చని, ఆందోళన చెందవద్దని చెప్పాలి. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ గ్రామ సచివాలయాలతో సహా అన్ని చోట్లా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి.
► క్వారంటైన్ సెంటర్ల సంఖ్య కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి.
► ఇతర రాష్ట్రాల సరిహద్దులు పూర్తిగా తెరవడం వల్ల రాకపోకలు ఎక్కువై కరోనా కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు.
► సమీక్షలో డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య) ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోవిడ్–19పై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైరస్ కట్టడి వ్యూహాలు ఇలా..
హై రిస్క్ కేటగిరీకి విస్తృత పరీక్షలు...
► హై రిస్క్ కేటగిరీలో వారికి విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు జరిపి కరోనా బారి నుంచి కాపాడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా నియంత్రణ, వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల సేవలతోపాటు ఇకపై పొదుపు సంఘాలు, యూత్ క్లబ్ సభ్యుల సేవలను కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
పెరగనున్న ఆర్టీపీసీఆర్ టెస్టులు...
► ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ నిర్థారణ పరీక్షలకు ఆర్టీపీసీఆర్ టెస్టులే అత్యుత్తమం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభు త్వ, ప్రైవేట్ ల్యాబ్‌లు అదనం.
► చిత్తూరు జిల్లాలో రెండు, మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో పరీక్షలు చేస్తున్నారు.
► మరో నాలుగు ప్రైవేట్ ల్యాబొరేటరీల్లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులకు అనుమతించారు.
► ఇవికాకుండా 47 ట్రూనాట్ మెషీన్ల ద్వారా కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు.
► మంగళగిరిలోని ఎయిమ్స్‌లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులు జరుగుతున్నాయి
► నాకో (జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) ఆధ్వర్యంలో ఉన్న రెండు ల్యాబొరేటరీల్లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులే నిర్వహిస్తున్నారు.
► ఇక కొత్తగా 8 వైరాలజీ మెషీన్లు వస్తున్నాయి. మరో 75 ట్రూనాట్ మెషీన్లనూ తెస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రూనాట్ మెషీన్ల కంటే ఇవి రెండు రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగినవి కావడం గమనార్హం.
► వీటన్నిటి ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించనున్నారు.
హెచ్‌సీఎల్‌తో అవగాహన ఒప్పందం
► రాష్ట్రంలో స్టేట్ కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను అభివృద్ధి చేసి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వ్యవస్థతో తీర్చిదిద్దనున్నారు.
► దీనికోసం హెచ్‌సీఎల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది.
► ఉచితంగా సాంకేతిక వ్యవస్థ, సాఫ్ట్‌వేర్ సమకూర్చేందుకు హెచ్‌సీఎల్ అంగీకారం.
► నాలుగైదు రోజుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కంట్రోల్ రూమ్ సిద్ధం కానుంది.
వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు
రెండు రోజుల్లో రాష్ట్రానికి కొత్త వైరాలజీ మెషీన్లు వస్తున్నాయి. వీటితోపాటు 75 ట్రూనాట్ మెషీన్లు కూడా వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టెస్టులు చేసే అవకాశం ఉంటుంది. ఇవికాకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నాం. అందులో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్‌కు రిఫర్ చేస్తాం. ఎక్కువ మందికి టెస్టులు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు’
– కాటమనేని భాస్కర్ (కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్)
వైద్యులపై పనిభారం లేకుండా ప్రణాళిక..
వైద్యులు, వసతులపరంగా నాణ్యమైన సేవలందించేందుకు కోవిడ్ ఆస్పత్రులను బలోపేతం చేయాలి. క్రిటికల్ కేర్ కోసం నిర్దేశించిన రాష్ట్రస్థాయి 5 ప్రధాన ఆస్పత్రుల్లో వైద్యులపై పని భారం లేకుండా ప్రణాళిక రూపొందించాలి. కోవిడ్ కేసుల చికిత్సకు ఉద్దేశించిన 84 జిల్లా ఆస్పత్రులను నియంత్రణలోకి తీసుకొని, రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రుల మాదిరిగా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలి. సదుపాయాలు, వైద్య సిబ్బంది పరంగా ఏవి అవసరమో రెండు మూడు రోజుల్లోగా నివేదిక సిద్ధం చేయాలి. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఆక్సిజన్ పడకల సామర్థ్యం పెంపు..
► ఆక్సిజన్ పడకల సామర్థ్యం 1.68 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి 2.03 లక్షల క్యూబిక్ మీటర్లకు పెరగనుంది. స్టేట్ నోడల్ ఆస్పత్రుల నుంచి జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ల వరకూ ఆక్సిజన్ సౌకర్యంతో పడకలు
► దీర్ఘకాలిక జబ్బులున్న వారిని గుర్తించి అవసరమైతే వెంటనే ఆక్సిజన్ సదుపాయం కల్పించనున్నారు. లక్షణాలు, వైరస్ తీవ్రత మేరకు ఇంట్లో చికిత్సకు ఏర్పాట్లు.
Comments
Please login to add a commentAdd a comment