
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో జనతా బజార్లను ఏర్పాటుచేసే దిశగా ప్రయత్నాలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ జనతా బజార్ల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబధించిన పలు ప్రతిపాదనలను కూడా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. మండల కేంద్రాల్లో కూడా జనతా బజార్లు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. దాదాపు 22 వేల జనతా బజార్లతో పెద్ద నెట్‌వర్క్ ఏర్పడుతుందన్నారు. ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలని సీఎం చెప్పారు.
(వారికి ముందుగా పరీక్షలు చేయాలి : సీఎం జగన్)
జనతా బజార్లకు సంబంధించి మ్యాపింగ్ చేయాలి
‘‘పాలు, పళ్లు, కూరగాయలు తదితర వాటిని నిల్వచేసి విక్రయానికి అందుబాటులో పెట్టాలి. వీటివద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్ వ్యాన్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలి. ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి. మరో వైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు, దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఈ వాహనాలు ఉపయోగపడతాయి. జనతా బజార్లకు సంబంధించి మ్యాపింగ్ చేయాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతు బజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించారు. ప్రతి నిత్యావసర వస్తువును దాదాపుగా ప్రతి గడపకూ చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా రూపంలో పలు మార్కెట్ అవకాశాలు కూడా వచ్చాయి. ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆమేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చేయండి. దాంతో రైతులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయి’అని సీఎం పేర్కొన్నారు.
(‘డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్’ను ప్రారంభించిన సీఎం జగన్)
రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుంది..
లాభ, నష్టాలు లేని రీతిలో జనతా బజార్లు నిర్వహిస్తే.. ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయని సీఎం అన్నారు. ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడవుతాయి.. ప్రతి నియోజకవర్గానికీ కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలని.. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుందని సీఎం పేర్కొన్నారు. మార్కెట్లో జోక్యం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. తద్వారా రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందని.. ఇది సక్రమంగా చేయగలిగితే.. అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మంచి జరుగుతుందని చెప్పారు. గ్రామాల స్వరూపాలు మారిపోతాయని సీఎం వివరించారు.
సమిష్టిగా కృషి చేయాలి
అలాగే ప్రతి గ్రామంలోనూ గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలని సీఎం తెలిపారు. గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుందని.. ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్ షిప్ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. వైఎస్సార్ జనతా బజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.