సాక్షి, అమరావతి: ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం వరద తగ్గడంతో సరఫరా పెంచామని, వారం రోజులపాటు పూర్తిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం ఆయన ‘స్పందన’పై సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.
వరద తగ్గినందున వారం రోజులుగా సరఫరా పెరిగిందని, ప్రస్తుతం రోజుకు 1.20 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని వివరించారు. వారం రోజుల్లో దీనిని 2 లక్షల టన్నులకు పెంచాలన్నారు. ఈ నెల 6వ తేదీ నాటికి మొత్తం 275 రీచ్‌లకు గాను 83 చోట్ల ఇసుక తవ్వకాలు జరపగా, ఈనెల 11వ తేదీ నాటికి మొత్తం 280 రీచ్‌లలో 99 ఆపరేషన్‌లో ఉన్నాయని చెప్పారు. ఇసుక వారోత్సవాలు ముగిసే నాటికి ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180కి పెంచేలా జాయింట్ కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
నియోజకవర్గాల వారీగా రేటు కార్డులు
నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. ఈ ధరలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ప్రజల అవసరాలకు సరిపడా ఇసుకను స్టాక్ యార్డుల్లో సిద్ధంగా ఉంచుతామని, నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు ఎవరు విక్రయించినా ఇసుకను సీజ్ చేయాలని ఆదేశించారు. దీనికితోడు అపరాధ రుసుం, రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా రూపొందించిన ముసాయిదా చట్టానికి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకుంటామన్నారు.
ఇసుక కొరత తీరే వరకు సంబంధిత విభాగాల్లోని ఉద్యోగులెవరూ సెలవులు తీసుకోరాదని సీఎం సూచించారు. పది రోజుల్లోగా సరిహద్దుల్లో చిన్న, పెద్ద రూట్లలో ప్రతి చోటా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా, నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment