నాణ్యత తగ్గకూడదు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting Over Mana Badi Nadu Nedu Program | Sakshi
Sakshi News home page

నాడు- నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష

Published Fri, Feb 7 2020 2:31 PM | Last Updated on Fri, Feb 7 2020 5:42 PM

CM YS Jagan Review Meeting Over Mana Badi Nadu Nedu Program - Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములవుతున్న తల్లిదండ్రుల పేర్లను స్కూళ్ల నోటీసు బోర్డులపై డిస్‌ప్లే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల, కాలేజీల రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్ల ఛైర్మన్లు జస్టిస్‌ కాంతారావు, జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పాఠశాలల్లో తొమ్మిది రకాల వసతుల కల్పన అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. నాడు- నేడు కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత, మూడో విడత కింద చేపట్టాల్సిన పనులు, టెండర్ల ప్రక్రియపై ఆరా తీశారు. ఈ క్రమంలో మే మధ్యంతరంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని, టెండర్లు ఖరారు కాగానే పనులు మొదలుపెడతామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అదే విధంగా పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది రూ.1000 కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. 

మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పెట్టిన తర్వాత పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారని.. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల వలస ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు- నేడు కింద చేపట్టాల్సిన పనులపై సీఎం జగన్‌ అధికారులకు మరిన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీని దశలవారీగా అమలు చేయాలన్నారు.

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పరిస్థితులపై చర్చ
సమీక్షా సమావేశంలో భాగంగా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల పరిస్థితులపై కూడా సీఎం, అధికారులు చర్చించారు. చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో  నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అధిక ఫీజులపై కూడా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్య అందించాలని స్పష్టం చేశారు.

మనబడి నాడు-నేడు.. తొలి విడత కార్యక్రమం ప్రగతి

  • 15,715 పాఠశాలల్లో తొలి విడత మనబడి నాడు-నేడు కార్యక్రమం 
  • 8853 ప్రైమరీ స్కూళ్లు, 3068 అప్పర్‌ప్రైమరీ స్కూళ్లు, 2457 హైస్కూళ్లు, 1337 రెసిడెన్షియల్‌ స్కూళ్లు
  • మొత్తంగా 15,072 స్కూళ్లకు రూ. 3,373 కోట్లతో ప్రతిపాదనలు పూర్తి 
  • 14,843 స్కూళ్లకు పరిపాలనా పరమైన అనుమతులు
  • 14,591 స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలతో అవగాహన ఒప్పందం
  • 12,647 స్కూళ్లలో పనులకు భూమి పూజ
  • బ్యాంకు ఖాతాలు తెరిచిన 14,851 విద్యా కమిటీలు


రెండో విడతలో నాడు-నేడు కింద
9476 ప్రాథమిక పాఠశాలలు
అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 822
హైస్కూళ్లు 2771
ప్రభుత్వ హాస్టళ్లు 1407
జూనియర్‌ కళాశాలలు 458... మొత్తంగా 14,934 

మూడో విడతలో నాడు-నేడు కింద
15,405 ప్రైమరీ స్కూళ్లు
 అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 216 
హైస్కూల్స్‌ 41
రెసిడెన్షియల్‌ స్కూళ్లు 63
గవర్నమెంటు హాస్టళ్లు 248 
జూనియర్‌ కళాశాలలు 18
మూడో విడతలో మొత్తంగా 15,991

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement