వలస కూలీలను ఆదుకుందాం | CM YS Jagan Review With Officials On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

వలస కూలీలను ఆదుకుందాం

Published Sun, May 17 2020 3:10 AM | Last Updated on Sun, May 17 2020 7:57 AM

CM YS Jagan Review With Officials On Covid-19 Prevention - Sakshi

కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలి. ఇది జరగాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. ప్రజల్లో భయాందోళనలను పోగొట్టడానికి ముందుగా చర్యలు తీసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నాయని తెలియగానే పరీక్షలు, వైద్యం చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే మరింత సమర్థవంతంగా వైరస్‌ను అరికట్టగలుగుతాం. 

నడిచి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలి. వారి పట్ల ఉదారంగా ఉండాలి. ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలి. ప్రొటోకాల్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వారి వద్ద చార్జీలు వసూలు చేయొద్దు. 15 రోజుల పాటు వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.  

కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్‌ ఉన్నదీ లేనిదీ ఒక వ్యక్తి ఎలా నిర్ధారించుకోగలుగుతారు అన్నది చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరం. లక్షణాలను గుర్తించి వైద్యం కోసం వెళ్లేలా అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలి.  

సాక్షి, అమరావతి:  మండుటెండలో పిల్లా, పాపలతో నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీల పట్ల ఉదారత చూపాలని, వారికి తగిన సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రం మీదుగా వెళ్తున్న వలస కూలీలు కొందరు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలు, వలస కూలీలు, జాగ్రత్తలు తీసుకుంటూనే సాధారణ కార్యకలాపాలు కొనసాగించడం, రైతు భరోసా కేంద్రాలు.. తదితర అంశాలపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీలను వారి సొంత ఊళ్లకు పంపేందుకు బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. నడిచి వెళ్తున్న వలస కార్మికులు.. ఎక్కడికక్కడ ప్రొటోకాల్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో 15 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.   

జాగ్రత్తలతో కార్యకలాపాలు 
కోవిడ్‌–19 విస్తరించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తిరిగి కార్యకలాపాలను ప్రారంభించేందుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన, వివక్ష తగ్గించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 
► ప్రజలు వైద్యానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కరోనా రావడం తప్పు కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకోపోవాల్సి ఉందని స్పష్టం చేశారు.   
క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆందోళన వద్దని తెలియజెప్పాలి 
► కోవిడ్‌ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలి. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలి.  
► బస్సుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు.. రెస్టారెంట్లు, మాల్స్‌లో క్రమ క్రమంగా తిరిగి కార్యకలాపాలు మొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు చేయాలి. 
► కరోనాపై ఆందోళన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే భయపడవద్దని, అనుమానం వస్తే.. ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను ఇంటింటా పంచే కరపత్రంలో పొందుపరచాలి. ప్రజలు స్వతంత్రంగా ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది.  

వైఖరిలో మార్పు రావాలి 
► కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం, తక్కువ చేసి చూడటం మానుకోవాలి. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ముఖ్యమైనవి. భవిష్యత్తులో విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలను తీసుకెళ్లాలి.  
► భౌతిక దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకు రావాలి. తన దుకాణం ముందు వృత్తాలు గీసుకునేలా వారికి అవగాహన కల్పించాలి. 

రైతు భరోసా కేంద్రాలు 
► వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషించబోతున్నాయని సీఎం అన్నారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విధానం, మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ విధానం.. ఈ రెండూ చాలా ముఖ్యమైనవని చెప్పారు. వీటి విషయంలో రైతు భరోసా కేంద్రాలు సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కర్నూలు, అనంతలో పెరిగిన డిశ్చార్జ్‌లు
► రాష్ట్రంలో డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయని, శుక్రవారం ఒక్క రోజే 101 మంది డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  
► గత 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 31 కేసులు కోయంబేడుకు సంబంధించినవేనని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో డిశ్చార్జ్‌ల సంఖ్య బాగా పెరిగిందని వివరించారు. 
► లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహంలో వైద్య పరంగా ఎలాంటి విధానాలను అనుసరించాల్సిన దానిపై సమావేశంలో చర్చ జరిగింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో టెస్టింగ్‌ కెపాసిటీని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

హైవేలపై ప్రత్యేక శిబిరాలు
వలస కూలీల కోసం తక్షణమే ఏర్పాటుచేయాలని సీఎస్‌ ఆదేశం 
జాతీయ రహదారులపై నడిచి లేదా సైకిళ్లపై వెళుతున్న వలస కూలీలకు అన్ని సౌకర్యాలతో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి.. ఆ తర్వాత వారిని రైళ్లు, బస్సుల్లో స్వరాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. ఇందుకోసం జాతీయ రహదారులపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి.. అక్కడ వలస కూలీలకు ఆహారం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. హైవేలపై పెట్రోలింగ్‌ నిర్వహించి వలస కూలీలను ఆపివేసి వారిని శిబిరాల్లో ఉంచాలన్నారు. వచ్చే 15 రోజుల వరకూ ఈ ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించినట్టు ఆమె చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శనివారం క్యాంపు కార్యాలయం నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంకా ఏమన్నారంటే.. 

బిడ్డను చంకన ఎత్తుకొని, నెత్తిపై బండెడు బరువును మోస్తూ కర్ణాటక నుంచి శ్రీకాకుళానికి కాలి నడకన వెళ్తోంది ఈ మహిళ. మార్గం మధ్యలో తాడేపల్లి వద్ద ఈమెతోపాటు పలువురు వలస కూలీలను పోలీసులు విజయవాడ క్లబ్‌లోని రిలీఫ్‌ క్యాంపునకు చేర్చారు. అక్కడ  వారికి భోజనం, వసతి కల్పించి.. ఆ తర్వాత బస్సులో గమ్యస్థానానికి చేర్చారు.  

► ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాక, మన రాష్ట్రానికి చెందిన వారికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలి. 
► ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని రాష్ట్రాలవారీగా, మన రాష్ట్రానికి చెందిన వారిని జిల్లాల వారీగా వేరు చేసి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలి. 
► జాతీయ రహదారులపై ప్రతి చెక్‌ పోస్టు వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత జిల్లాలకు పంపే ఏర్పాట్లు చేయాలి. 
► రెండు రోజులుగా నడిచి వెళుతున్న సుమారు రెండు వేల మంది ఒడిశాకు చెందిన వలస కూలీలను గుర్తించి, వారిని ఆ రాష్ట్ర సరిహద్దు వరకూ బస్సులు, రైళ్ల ద్వారా పంపేందుకు ఏర్పాట్లు చేశాం. 
► కరోనా టెస్టుల సంఖ్యను రెట్టింపు చేయాలి.. ఆ వైరస్‌ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలి. 
► వైఎస్సార్‌ గ్రామ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలకు అవసరమైన స్థలాలను త్వరితగతిన గుర్తించాలి. 
► వలస కూలీల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించొద్దని పోలీసులకు సూచించాలని డీజీపీ, ఎస్పీలను ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్‌ పియూష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement