కాంట్రాక్టర్ పోగేసుకున్న టెంకాయ చిప్పలు
మంత్రాలయం: స్వామీ నిన్ను కొలవని వారికి నీవంటే భయం.. నిన్ను కొలిచే వారికి నీవంటే భక్తి.. నీ భక్తులను మోసం చేసేవారికి నీ సన్నిధి ఓ వ్యాపార కేంద్రం. ఇక్కడ రావాల్సింది అధికారులకు వస్తోంది. కావాల్సిన దానికి మించి కాంట్రాక్టర్‌కు మిగులుతోంది. దేవుని సాక్షిగా రూ.కోట్లలో అవినీతి పర్వం దర్జాగా సాగిపోతోంది. ఏటా దోపిడీ విలువ అక్షరాల కోటి రూపాయలు. ఈ సొమ్మంతా భక్తుల నుంచి దోచుకుంటున్నదే. ప్రముఖ ఉరుకుంద నృసింహ ఈరన్న స్వామి పుణ్య క్షేత్రంలో అధికారులు, కాంట్రాక్టర్లు ఏటా చేస్తున్న దగా ఇదీ. దోపిడీ లీలలు కన్నామంటే కళ్లు తిరిగాల్సిందే. ఇదిగో దోపిడీ బాగోతం.
నారీకేళాల సమర్పణ 14 లక్షలు
పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణ సోమ, గురు, శనివారాలు భక్తుల రద్దీ ఉంటుంది. నెలలో దాదాపు 10 లక్షల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శిస్తారు. అందులో ఎంతలేదన్న 7 లక్షల మంది భక్తులు జోడు టెంకాయలు స్వామికి సమర్పిస్తారు. ఈ లెక్కన క్షేత్రంలో అమ్ముడు పోయే టెంకాయలు 14 లక్షలు. టెంకాయలు ప్రతి భక్తుడూ ఇక్కడే కొనుగోలు చేస్తారు. టెంకాయల సమర్పణకు ఎలాంటి టిక్కెట్ లేకున్నా కొట్టే అర్చకులకు జోడికి రూ.10 ఇచ్చుకుంటారు.
వాస్తవ ఖర్చు..
టెండర్‌దారులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇక్కడకు టెంకాయలు తీసుకువస్తారు. అక్కడ పెద్దసైజు టెంకాయ రూ.15, మధ్య సైజు టెంకాయ రూ.14, చిన్నసైజు రూ.10–12 ధర పలుకుతోంది. ఉరుకుంద క్షేత్రంలో మధ్యసైజు టెంకాయలు విక్రయిస్తారు. ఉత్సవాలకు 56 లారీల్లో (10 టైర్లు) టెంకాయలు దిగుమతి చేసుకుంటారు. ఒక్కో లారీలో 25 వేలు మధ్య సైజు టెంకాయలు లోడింగ్ అవుతోంది. ఒక్క లారీ బాడుగ అక్కడి నుంచి ఉరుకుందకు రూ.24 వేలు. బాడుగతో కలిపి లారీ టెంకాయలు రూ.3.74 లక్షలు. 56 లారీల టెంకాయలు విలువ రూ.1.96 కోట్లు. అందుకు లారీల బాడుగ మొత్తం రూ.13.44 లక్షలు. అంతా కలిపి కాంట్రాక్టర్ 56 లారీల సరుకు తెప్పించేందుకు గానూ రూ.2.09,44,000 వెచ్చిస్తారు.
దోపిడీ తతంగం..
ఈఏడాది ఆదోనికి చెందిన మోహన్ అనే వ్యక్తి టెంకాయల టెండర్ కైవసం చేసుకున్నారు. రూ.90.90 లక్షలకు టెండర్ పాడారు. జోడి టెంకాయలను భక్తులకు రూ.70 చొప్పున విక్రయిస్తున్నారు. 14 లక్షల టెంకాయలకుగానూ కాంట్రాక్టర్ ధర ప్రకారం వచ్చే మొత్తం రూ.4.90కోట్లు. అందులో ఆయన వెచ్చించిన నగదు రూ.2.09 కోట్లు. టెండర్ చెల్లింపు (రూ90.90 లక్షలు)తో కలిపి ఖర్చు రూ.3 కోట్లు అవుతోంది. భక్తులు సమర్పించిన టెంకాయలో అర చిప్ప కాంట్రాక్టర్‌కే సంబంధం. బయట మార్కెట్లో ఒక్కో చిప్ప ధర రూ.3లు. 14 లక్షల చిప్పలకుగానూ రూ.42 లక్షలు వస్తోంది. టెంకాయ కొట్టుకు 100 టెంకాయలు వేసేందుకు చేసే వసూలు 100. టెంకాయలకు రూ.60. ఈ లెక్కన వచ్చే ఆదాయం రూ.8.40 లక్షలు. అదనపు రేటు, చిప్పల విలువ కలిపి ఆయనకు నికరంగా మిగులు రూ.5,40,40,000. అందులో వెచ్చించి న ఖర్చు, టెండర్ నగదు తీసివేయగా దోపిడీ విలువ రూ.1.49 కోట్లు. ఇదీ ముమ్మాటికీ భక్తుల నుంచి దోచుకున్న సొమ్ము.
అంతా కుమ్మక్కు..
ఏటా శ్రావణమాసంలో జరుగుతున్న దోపిడీ ఇది. కిందిస్థాయి నుంచి పైస్థాయి దేవదాయ శాఖాధికారులకు తెలిసిన విషయమే. ఇంతగా భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఆలయ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అటు దేవుడికి శఠగోపం, భక్తుల నెత్తిన టెంకాయ కొడుతున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అవినీతి సొమ్మును పంచుకు తింటున్నారు. భక్తులు ఎంతగా అరిచి గీపెట్టుకున్నా క్షేత్రం అధికారుల్లో చలనం లేదు. కారణం ఎవరికి ముట్టాల్సింది వారికి ముడుతోంది. ట్రస్టుబోర్డు కమిటీ సభ్యులు ఉన్నా ఫలితం శూన్యం. భక్తుల గోడు పట్టించుకునే పాపాన పోలేదు. నిలువు దోపిడీని అరికట్టి భక్తుల జేబులకు కన్నాలు వేయడం మానుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు. ఈ విషయమై ఇటీవల ఈఓ రామ్‌ప్రసాద్ అడుగగా అధిక ధరలకు విక్రయించకుండా తగ్గించే ప్రయత్నం చేస్తామని సెలవిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment