కోడ్ దాటితే కొరడా | Code exceeds the whip | Sakshi
Sakshi News home page

కోడ్ దాటితే కొరడా

Published Sun, Mar 16 2014 12:02 AM | Last Updated on Mon, Oct 8 2018 4:27 PM

కోడ్ దాటితే కొరడా - Sakshi

కోడ్ దాటితే కొరడా

  •     రాజకీయ పార్టీలకు హెచ్చరిక
  •      సక్రమంగా ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచన
  •      రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీల ప్రతినిధులు విధిగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ నిబంధనల ప్రకారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కోర్టులో కేసు వేస్తే అభ్యర్థులను పోటీ నుంచి తొలగించే అవకాశం కూడా ఉందన్నారు.

    ఈ విషయాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు వివరించి మోడల్‌కోడ్‌ను ఉల్లంఘించకుండా చూడాలన్నారు. పత్రికలకు ప్రకటనలు ఇచ్చే ముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతి మంజూరవుతుందన్నారు. ఈవీఎంలకు సీలు వేసినపుడు పార్టీ ప్రతినిధులు తనిఖీ చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, టీడీపీ ప్రతినిధి బి.ఎల్.ఎన్.మణిశంకరనాయుడు, బీజేపీ నుంచి పి.వి.నారాయణరావు, సీపీఐ నుంచి ఎం.పైడిరాజు, సీపీఎం ప్రతినిధి కె.లోకనాధం పాల్గొన్నారు.
     
    విమర్శలకు అవకాశం లేకుండా విధులు
     
    ఎన్నికల నిర్వహణలో ఏ రాజకీయ పార్టీ నుంచి విమర్శలకు తావులేకుండా విధులు నిర్వహించాలని జిల్లా అధికారులకు భన్వర్‌లాల్ సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పుస్తకాన్ని సక్రమంగా చదవాలన్నారు. లేదంటే పొరపాట్లు జరిగే అవకాశముందన్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఫారం-26లో ఉన్న 7 పేజీలలో పూర్తి వివరాలు పొందుపరచాలన్నారు. నామినేషన్ తిరస్కరణ నిబంధనలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, సీపీ శివధర్‌రెడ్డి,ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
     
    54వేల కొత్త దరఖాస్తులు
     
    ఓటరుగా నమోదుకు జిల్లాలో 54 వేల కొత్త దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. వాటన్నింటినీ ఈ నెల 20వ తేదీ నాటికి పరిశీలించి, ఏప్రిల్ మొదటి వారంలోగా స్మార్ట్ ఓటరు గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని వెల్లడించారు.
     
    ఈ నెల 9న నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో ఒక దరఖాస్తు రాని, బూత్‌లెవెల్ అధికారు(బీఎల్‌వో)లు గైర్హాజరైన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమం మళ్లీ ఉంటుందన్నారు. బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే దరఖాస్తు సమర్పించాలని సూచించారు. కేంద్రాలకు రాని బీఎల్‌వోలపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement