కలెక్టర్ హరి కిరణ్
సాక్షి, కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త గ్రామ సచివాలయ పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల పాలనకు శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్య్ర వేడుకల అనంతరం గురువారం ఉదయం 11 .00 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని ప్రారంభిస్తారు. తొలిరోజు వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం వలంటీర్లు వారి పరిధిలోని గృహాలకు వెళ్లి పరిచయ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ సచి వాలయ పాలనలో భాగస్వాములవుతారు. గ్రామ సచివా లయ పాలనను ప్రభుత్వం పారదర్శకంగా, అవినీతి రహితంగా నిర్వహించాలని కృత నిశ్చయంతో ఉంది.
ఈ పాలనను ముందుకు నడిపించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లపై పెట్టింది. గురువారం నుంచి గ్రామ వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం నేపథ్యంలో వారి విధి విదానాలు, పాలన తీరుతెన్నులను కలెక్టర్ సీహెచ్ హరి కిరణ్ ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. గ్రామ వలంటీర్ల పాలనను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ తెలిపారు.అనంతరం సీఎం సందేశమిస్తారన్నారు. ప్రభుత్వ పాలన ఎంత పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉంటుందో ఆయన తెలియజేస్తారన్నారు. వలంటీర్ల పనితీరు, వారి నడత, నడక ఎలా ఉండాలో స్పష్టత ఇస్తారని, ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎలా తీసుకెళ్లాలో ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేస్తారని కలెక్టర్ తెలిపారు.
సీఎం సందేశం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం ఇందులో పాల్గొంటారన్నారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు వలంటీర్ల పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు. వారికి కేటాయించిన 50 లేదా 60 గృహాలకు వెళ్లి వారు పరిచయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 23 నుంచి 30వ తేది వరకు గ్రామాల్లో అర్హులైçన వారికి నివాస స్థలాల కోసం సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు.వారం రోజుల్లో వలంటీర్లు దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. తర్వాత శిక్షణా తరగతులు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. వలంటీర్లు బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించమని చెప్పారు.
గాంధీజయంతి నుంచి గ్రామసచివాలయ వ్యవస్థ
అక్టోబరులో గాంధీ జయంతి నాటి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి వస్తుందని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను ప్రభుత్వం అక్కడి నుంచే అమలు చేస్తుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపికకు సంబంధించి సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కేటగిరి–1 పరిధిలో జిల్లాలో 82 వేల మంది ఆన్‌లైన్‌లో, అన్ని కేటగిరీలకు కలిపి లక్షా 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 400 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇప్పటికే ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను సైతం త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో అర్హులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇంటి స్థలాల కోసం జమ్మలమడుగు డివిజన్ మినహా మిగిలిన డివిజన్ల పరిధిలో 2021 ఎకరాలు గుర్తించామన్నారు స్పం దన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. గ్రామ సచివా లయ వ్యవస్థ రాగానే అర్హులందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు అందజేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment