రాజధానితోనే ‘ప్రకాశం’ | Collector Powerpoint presentation in front sivaramakrishnan committee | Sakshi
Sakshi News home page

రాజధానితోనే ‘ప్రకాశం’

Published Mon, Aug 11 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

Collector Powerpoint presentation in front sivaramakrishnan committee

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వెనుకబడిన ప్రకాశం జిల్లాకే రాజధాని దక్కాలి. ఒక్క పైసా ఖర్చు లేకుండా భూసేకరణ ఇక్కడే సాధ్యం. రోడ్డు, రైలు మార్గాలు, తాగునీరు.. అన్ని అనుకూలతలు ఉన్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజధాని సాధన సంస్థలు ముక్తకంఠంతో తమ డిమాండ్‌ను శివరామకృష్ణన్ కమిటీ ముందు ఉంచాయి.

 ఒంగోలు, దొనకొండ ప్రాంతాలను రాజధాని కోసం పరిశీలించాలని అన్ని వర్గాల నేతలు కోరారు. రాజధాని కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం జిల్లాలో పర్యటించింది. తొలుత కొత్తపట్నం వద్ద వాన్‌పిక్ భూములు, బకింగ్‌హామ్ కెనాల్‌ను ఈ బృందం పరిశీలించింది. తర్వాత కలెక్టర్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అనంతరం దొనకొండ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ  జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ ఈ ప్రాంతంలో ఉన్న అనుకూలతలను ఏకరవు పెట్టారు.

 జిల్లాలో ఉన్న వనరులు, భూముల లభ్యతతో పాటు ఈ ప్రాంతమే ఎందుకు రాజధాని కావాలనే అంశంపై కలెక్టర్  విజయకుమార్ రూపొందించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందరి మన్ననలు పొందింది.
  కమిటీ సభ్యులు కూడా ఇంజినీర్లు, ఇతర సాంకేతిక నిపుణులు మాట్లాడినపుడు పలు అంశాలపై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.

 తొలుత ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు దొనకొండ ప్రాంతం అందుబాటులో ఉంటుందని ఎవరికీ అభ్యంతరాలు ఉండవని స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం ఐదు కోట్ల రూపాయలపైన ఉందని, డెల్టా దెబ్బతినే పరిస్థితి వస్తుందని అందువల్ల దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పలు అనుమానాలకు దారితీస్తోందని సుబ్బారెడ్డి విమర్శించారు.
 
జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు కూడా దొనకొండను రాజధానిగా ఎంపిక చేయాలనే డిమాండ్‌కు మద్దతు పలికారు. తన నియోజకవర్గంలో 65 వేల ఎకరాల వరకూ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయన తన నివేదికలో ప్రస్తావించారు.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న మంత్రులు సైతం రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నారని, 42 ఖాళీ స్థలాలు ఉన్న అద్దంకి- మార్టూరు మధ్య రాజధాని నిర్మాణం చేయాలని కోరారు.

 కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ ఒంగోలును రాజధానిగా ఎంపికచేసి వాన్ పిక్ స్థలాలను ఉపయోగించుకోవడంతోపాటు పలు ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పితే వెనుకబడిన జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు.

రాజధాని నిర్మాణానికి ప్రకాశం అనుకూలంగా ఉంటుందని తెలుగు రైతు రాష్ర్ట అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి తన నివేదికలో పేర్కొన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్ కైపు వెలుగొండారెడ్డి మాట్లాడుతూ దొనకొండ కేంద్రంగా తీసుకుంటే 300 కిలోమీటర్ల రేడియస్‌లో 3.59 కోట్ల మంది నివాసం ఉంటున్నారని, అదే విజయవాడ కేంద్రంగా 300 కిలోమీటర్ల రేడియస్ 2.49 కోట్ల మంది మాత్రమే నివాసం ఉంటున్నారని చెప్పారు.

మరో సివిల్ ఇంజినీర్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలంటే అందుకు కావాల్సిన కంకర, క్వారీ డస్ట్, తాగునీరు పూర్తిగా అందుబాటులో ఉందని ఉదాహరణలతో సహా వివరించారు. వాన్‌పిక్ భూములున్న ప్రాంతంలోని నీరు నిర్మాణానికి పనికిరాదని, కానీ గుండ్లకమ్మ కాలువలను పొడిగించి వినియోగించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణుల కమిటీకి వివరించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు కరవది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రకాశం పంతులు నడయాడిన నేల అయిన ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు.

జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, జంకె వెంకటరెడ్డి, బాల వీరాంజనేయ స్వామి,  జెడ్పీ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, రాజధాని సాధన సమితితో పాటు పలువురు కమిటీకి వినతిపత్రాలు అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement