
నక్కపల్లి (పాయకరావుపేట)/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్)/ఏలూరు టౌన్: దళిత ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాలుగు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో సీఐ విజయకుమార్, ఎస్‌ఐ రామకృçష్ణలకు ఫిర్యాదు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై బోస్టన్ కమిటీ నివేదికను చదివి వినిపించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను చంద్రబాబు వాడు వీడు అంటూ సంబోధించి చులకనగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కాగా, చంద్రబాబుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సౌత్‌జోన్ ఏసీపీ సూర్యచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చారు.
ఏలూరులో దళిత్ రైట్స్ ఫోరం ఫిర్యాదు
దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బేతాళ సుదర్శన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కర్నూలులో..
ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ప్రజా, దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి వారంతా నిరసన తెలిపారు.
విజయవాడలో..
తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్ తిరుమలరావుకు సోమవారం దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితుల పట్ల టీడీపీ తీరు మార్చుకోకపోతే రాజకీయసమాధి కడతామని హెచ్చరించారు.
మున్సిపల్ కమిషనర్ల సంఘం ఆగ్రహం
ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్‌పై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను మున్సిపల్ కమిషనర్ల సంఘం ఖండించింది. విజయ్ కుమార్‌ని కించపరిచేలా మాట్లాడడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రణాళిక శాఖ కార్యదర్శిగా విజయ్ కుమార్ బీసీజీ నివేదికను వివరించారని, రాజధానిపై కీలక సమాచారాన్ని వివరించడం ఉన్నతాధికారిగా ఆయన బాధ్యత అని తెలిపింది. అధికారిగా తన విధులు నిర్వర్తించిన విజయ కుమార్‌ను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడటం తగదని, చంద్రబాబు తక్షణమే తన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు ఆశాజ్యోతి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు..
Comments
Please login to add a commentAdd a comment