
సమైక్యతకు కృషిచేస్తున్నది జగనే: ఎస్పీవై రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరారు. వారికి జగన్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ జైల్లో ఉన్నా సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా నిరాహారదీక్ష చేశారని ప్రశంసించారు.
సమైక్యాంధ్ర కోసం నిజాయితీగా పోరాడుతున్న రాజకీయ నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. అందుకే సమైక్యాంధ్రకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, అందుకే ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. అందుకోసం లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ ఖరారైందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చని చెప్పారు. ఎస్పీవై రెడ్డి నిర్ణయాన్ని పార్టీ తరఫున అభినందిస్తూ ఆహ్వానిస్తున్నట్లు శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. రైతులకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్పందించి ఆదుకోవడంలో ఎస్పీవై రెడ్డి ముందుంటారని చెప్పారు. ఆయనకు పార్టీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆమె వివరించారు.