
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య సయోధ్యకు యత్నం: నారాయణ
వారు లోపల ఒకలా, బయట ఒకలా ప్రవర్తిస్తున్నారు
అయినా ప్రజల కోసం కలిపే ప్రయత్నం చేస్తున్నాం
మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒకటికాదని
పవన్‌కల్యాణ్ తెలుసుకోవాలని వ్యాఖ్య
హైదరాబాద్: టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను కలిపే యత్నం చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలతో కూటమిగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో నారాయణ మాట్లాడారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరినొకరు దూషించుకుంటూ రహస్య ఎజెండాతో వ్యవహరిస్తున్నారని.. లోపల ఒకలా, బయట మరోలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పోతే అభివృద్ధి సాధ్యం కాదని... అందుకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన ప్రభుత్వం ఏర్పడడం కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో కూటమిగా ఎన్నికలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నామని నారాయణ చెప్పారు. తెలంగాణవాదులను రాళ్లతో కొట్టించిన కొండా సురేఖను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోగా లేనిది.. మూడు పార్టీలు కలసి పోటీ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు.
పోలవరం డిజైన్ మార్చొద్దు: ‘‘పోలవరం నిర్మాణంతో నష్టపోయే వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. అంతేకానీ డిజైన్ మార్చితే ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఉండదు. ఉద్యోగులకు కొన్ని ఆప్షన్లు ఉంటాయని, అలాగని మెజారిటీ ఉద్యోగులు ఇక్కడే ఉంటామనడం సరికాదు’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.
పవన్ వ్యవహారం అర్థం కాలేదు: పవన్‌కల్యాణ్ రాజకీయాలేమిటో? ఆయన చెప్పిన విషయాలేమిటో.. తనకేమీ అర్థం కాలేదని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ మోడీని కలవడం, ఆయన ద్వారా ప్రచారం సాగించాలనుకోవడం సరికాదన్నారు. ‘‘చేగువేరాను ఎక్కువగా ఆరాధించే పవన్ ఒకటి తెలుసుకోవాలి. మోడీ గడ్డం, చేగువేరా గడ్డం ఒక్కటి కాదు! చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేది.. మోడీ గడ్డం సమాజాన్ని ధ్వంసం చేసేది’’ అని పేర్కొన్నారు. బూర్జువా పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముందని నారాయణ పేర్కొన్నారు.