విశాఖ ఏయూలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు. చిత్రంలో ద్రోణంరాజు శ్రీనివాస్, జక్కంపూడి రాజా, తిప్పల నాగిరెడ్డి తదితరులు
మూడు రాజధానుల నినాదం రాష్ట్రమంతటా మార్మోగింది. పాలన, అధికార వికేంద్రీకరణ ఉపయోగా లను చాటుతూ సదస్సులు నిర్వహిం చారు. పలుచోట్ల ర్యాలీలు కొనసాగాయి. మూడు రాజధానులకు మోకాలడ్డుతూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై ప్రజాసంఘాల నేతలు, మేధావులు విరుచుకుపడ్డారు.
– సాక్షి నెట్‌వర్క్
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో ‘అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి’ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు హాజరై సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ కళాశాలలో ‘పరిపాలన వికేంద్రీకరణ–రాష్ట్రాభివృద్ధి’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు మేధావులు, విద్యార్థి సంఘాల నేతలు హాజరై మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని ఘంటాపథంగా చెప్పారు.
కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫ్రొఫెసర్ డాక్టర్ పి.రామకృష్ణంరాజు, ఓఎన్‌జీసీ రిటైర్డ్ జనరల్ మేనేజర్ పి.విజయకుమార్, డీఎన్నార్ పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ తదితరులు మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహానికి విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. మూడు రాజధానులకు మద్దతుగా రైతులు, యువత ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని కానూరు నుంచి ఉయ్యూరు సెంటర్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment