సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కొత్తగా కోలుకున్న 35 మందిని డిశ్చార్జి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,556కు చేరింది. తాజాగా డిశ్చార్జి అయిన వారిలో 14 మంది వలస కూలీలు ఉన్నారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 9,831 మందికి పరీక్షలు నిర్వహించగా 138 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వీటిలో 84 కేసులు వలస కూలీలకు చెందినవి కాగా, మరో నాలుగు కేసులు విదేశాల నుంచి వచ్చినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,250కు చేరింది. మొత్తం కేసుల్లో 700 వలస కూలీలవి కాగా, 123 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. కరోనాతో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 73కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,621గా ఉంది.
కరోనాను జయించిన 6 నెలల చిన్నారి
తిరుపతి రుయా నుంచి డిశ్చార్జి
కరోనా మహమ్మారి బారిన పడిన 6 నెలల చిన్నారి కోలుకుని ఇంటికి చేరుకుంది. చిత్తూరు జిల్లా కేవీబీ పురానికి చెందిన ఆ పసిపాపకు కరోనా సోకడంతో తిరుపతి రుయా కోవిడ్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యుల కృషితో వైరస్ నుంచి విజయవంతంగా కోలుకుని శుక్రవారం డిశ్చార్జి అయ్యింది. రుయా కోవిడ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం నలుగురు డిశ్చార్జి కాగా అందులో ఈ చిన్నారి కూడా ఉంది. చంటిబిడ్డ కరోనాను జయించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. తమ పాపకు వైద్యం అందించిన వైద్యులకు చిన్నారి తల్లి, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సేవలను కొనియాడారు. కోలుకున్న వారికి డిశ్చార్జి కాపీలను రుయా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి అందజేయగా. ప్రభుత్వం తరఫున రెవెన్యూ అధికారులు 2 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment