పసిపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే సరుకులను నిర్వాహకులు దర్జాగా నల్లబజారుకు తరలిస్తున్నారు. పిల్లల పొట్టకొడుతూ తమ బొజ్జలు నింపుకుంటున్నారు. చిన్నారుల ఆకలి తీర్చే ఆహారాన్ని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించే మాట అటుంచితే అసలు ఆహారమే అందించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రాల్లో నిర్వహణ లోపాలు, అవినీతి అక్రమాలపై జిల్లావ్యాప్తంగా స్త్రీశిశు సంక్షేమశాఖ కార్యాలయాలకు నిత్యం ఫిర్యాదులు అందడమే ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది.
సాక్షి, నెల్లూరు: చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు ప్రతినెలా అన్న అమృతహస్తం, బాలామృతం, మధ్యాహ్న భోజన పథకం, బాల సంజీవని ఇలా వివిధ రూపాల్లో పౌష్టికాహారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ప్రతినెలా రూ.కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఇందుకోసం వెచ్చిస్తుండగా అవన్నీ సక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కేంద్రాలపై ఉంది. ఆయా పథకాలను మాత్రం స్త్రీ అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధికారులు, ఉద్యోగులు పర్యవేక్షించాల్సిఉంది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇందుకు భిన్నంగా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో అవినీతి, అక్రమాలపై స్థానికులే ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుల పరంపరం వెల్లువెత్తుతోంది. నాలుగు నెలల వ్యవధిలో దాదాపు 20కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై సర్వే చేయిస్తే దాదాపు 10 వేల మంది విద్యార్థులు హాజరు పట్టికలో చూపి వారికి కేటాయించే నిధులు మాత్రం ఆ శాఖ చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు వాటాలు పంచుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల అంగన్‌వాడీ కేంద్రాలపై విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేయగా పథకాల అమలులో, విద్యార్థులు హాజరులో తేడాలున్నట్లు గుర్తించారు.
ఇవిగో అక్రమాలు
♦ ఇటీవల వెంకటగిరి పట్టణం కోళ్లఫారం సెంటర్లో సిబ్బంది మధ్య వివాదం చిన్నారుల కడుపు మాడ్చింది. కేంద్రానికి వచ్చిన పౌష్టికాహారం పనికిరాకుండా పోయింది. పిండి ముక్కిపోగా, గుడ్లు చెడిపోయాయి. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
♦ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూ రు, ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 440 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పోషకాహారం పంపిణీ పక్కదారి పడుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేసే పోషకాహారం అరకొరగా పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలు సమయపాలన పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. బాలసంజీవిని, కోడిగుడ్లను కేంద్రాల్లో లబ్ధిదారులకు అందజేయకుండా కార్యకర్తలు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
♦ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతల కక్కుర్తి చిన్నారులకు పౌష్టికాహారాన్ని దూరం చేసింది. తమ స్వలాభం కోసం తమ సొంత భవనాలనే అద్దెకు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారు. అంతేకాకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం వారికి దూరమతోంది.
♦ ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అనంతసాగరం మండలం కొత్తూరు అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మహిళ గత 9 నెలలుగా విధులకు డుమ్మా కొట్టింది. ఆ తొమ్మిది నెలలపాటు హాజరు రిజిస్టర్‌లో గైర్హాజరుగానే చూపిస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం ప్రతి నెలా జీతం మాత్రం ఇస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆమెకు ఇచ్చే నెల జీతంలో 70 శాతం స్థానిక సూపర్‌వైజర్ నుంచి ప్రాజెక్టు అధికారి వరకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే ఆమె వయస్సు 60 సంవత్సరాలు దాటి రిటైర్డ్ అయినా కూడా ఆమె ఆధార్ కార్డులో వయస్సు తగ్గించి మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఆ ప్రాజెక్టు పరిధిలో జరిగే అవినీతికి పరాకాష్టగా నిలిచింది. అలాగే గతంలో ఆయా కూడా అంగన్‌వాడీ కేంద్రంలో గ్యాస్ స్టౌ వెలిగించి ఇంటికి వెళ్లిపోవడంతో అగ్నిప్రమాదం జరిగే సమయంలో స్థానికులు గుర్తించి పిల్లలను బయటకు తరలించిన ఘటన జరిగింది. అప్పట్లో స్థానికులు ఆయాను తొలగించాలని ఫిర్యాదులు చేసినా టీడీపీ పెద్దల అండతో అధికారులు ఆమెను కొనసాగించారు.
♦ ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలోని శంకరనగరం గ్రామంలో కూడా గత రెండేళ్లుగా ఆయా విధులకు గైర్హాజరు అవుతున్నా ఆమెకు జీతం ఠంచన్‌గా ప్రతినెలా ఇస్తూ అధికారులు వాటాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి ఫిర్యాదులు జిల్లా కార్యాలయానికి వెల్లువెత్తుండడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
నేను బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ఆరా తీస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. నేనే రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకున్నా, పిల్లల హాజరులో తేడాలు ఉన్నా చర్యలు తీసుకుంటాం.– బి.సుధా భారతి, ఐసీడీఎస్ పీఓ
Comments
Please login to add a commentAdd a comment