అనుమసముద్రంపేట: రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఏఎస్‌పేట మండలంలోని పందిపాడులో రూ.4.5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో సువర్ణపాలన సాగిందని, అలాంటి పరిపాలన మళ్లీ రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని చెప్పారు. కుల, మతం లేకుండా వైఎస్సార్ గొప్ప మానవతావాదిగా పరిపాలించారని, అయితే ప్రస్తుతం చంద్రబాబు ఎమ్మెల్యేలను గౌరవించకుండా అర్హత లేని వారిని అందలమెక్కించారని ఆరోపించారు. వైఎస్సార్ పాలనను చూసి ఇప్పటికైనా చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్ హయాంలో 70 లక్షల గృహాలను ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పించారని, అర్హులైన పేదలకు పింఛన్లను ఇప్పించిన అంశాన్ని ప్రస్తావించారు.
అయితే ప్రస్తుతం కొంత మంది వృద్ధులకు అర్హత లేదంటూ పింఛన్లను కుదిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రజలదేనని చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని, రానున్న 2019 ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. మెట్ట ప్రాంత గ్రామాల్లో సాగు, తాగునీరు సమస్యగా మారిందని, వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవినీతి మంత్రులతో నిండిన అసెంబ్లీకి వెళ్లలేకనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పార్టీ మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, పార్టీ మహిళా కన్వీనర్ బోయళ్ల పద్మజారెడ్డి, గ్రామ సర్పంచ్ సుబ్బారెడ్డి, అనుమసముద్రం సర్పంచ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment