- కేంద్ర మంత్రి వర్గంలో జిల్లాకు ప్రాతినిథ్యం శూన్యం
- వెంకయ్యకు బెర్త్ ఖరారవడంతో హరిబాబుకు చేజారిన అవకాశం
- మలి విడతలోనూ కష్టమే
- గతంలో జిల్లా నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు
సాక్షి, విశాఖపట్నం: దేశ కొత్త ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో విశాఖకు చోటు దక్కలేదు. తొలి విడత కేటాయించే మంత్రి పదవుల్లో విశాఖ పార్లమెంట్ నుంచి హరిబాబుకు అవకాశం లభిస్తుందని అంతా అంచనా వేశారు. హరిబాబు సీమాంధ్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా కావడంతో కచ్చితంగా ఏదొక పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది.
కానీ సోమవారం నాటి కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారంలో ఆయనకు ఆ అవకాశం దక్కకుండా పోయింది. మలివిడత మంత్రి పదవుల కేటాయింపులో ఆయనకు అవకాశం లభిస్తుందని ఆయన అనుచరులు గట్టిగా చెబుతున్నారు. అసలు హరిబాబుకు మంత్రి పదవి లభించడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు మోడీ మంత్రివర్గంలో చోటిచ్చారు. దీంతో వెంకయ్య సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదవి దక్కకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ తరపున అశోక్ గజపతిరాజుకు మంత్రి పదవి కేటాయించారు. కర్ణాటక రాజ్యసభ కోటాలో వెంకయ్యను పదవి వరించింది. ఇప్పుడు మూడో పదవిగా హరిబాబుకు రాష్ట్రం నుంచి ఇవ్వడానికి మోడీ సుముఖంగా లేనట్టు సమాచారం.
మరోపక్క ఎంపీగా గెలిచిన తర్వాత కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని హరిబాబుతోపాటు ఆయన అనుచరులు గట్టిగా నమ్మారు. పైగా గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో హరిబాబు అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సీనియార్టీతో ఈసారి మంత్రి పదవితోపాటు కేంద్ర ఐటీ శాఖ వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికితోడు హరిబాబు కూడా గెలిచిన తర్వాత పార్టీ అగ్రనేతలను కలుసుకున్నారు.
తీరా ఇప్పుడు పదవి రాకపోవడంతో ఆయన అనుచర వర్గాలు నిరాశలో కూరుకుపోయాయి. తర్వాత ప్రకటించే జాబితాలోనూ అవకాశం దక్కకపోవచ్చని తెలియడంతో నిరాశ చెందుతున్నాయి. వెంకయ్యనాయుడు, హరిబాబు ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి రావడంతోపాటు ఒకరకంగా ఇద్దరు స్నేహితులు కూడా. ఈ నేపథ్యంలో వీరిలో ఒకరికి పదవి దక్కగా మరొకరికి అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి కొత్త ప్రధాని ప్రకటించిన మంత్రివర్గంలో ఈ ప్రాంతానికి చోటు దక్కకపోవడం విశాఖవాసులను నిరాశపర్చింది.