పత్తి రైతు చిత్తు
పతనమైన తెల్లబంగారం ధర
క్వింటాలుకు మద్దతు ధర రూ.4,050
రైతుకు ఇచ్చేది రూ.2,800
తడిసిందంటూ ధర తగ్గించిన వైనం
దోచుకుంటున్న దళారులు
ఆందోళనలో అన్నదాతలు
మచిలీపట్నం : తెల్లబంగారం ధర పతనమైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లభించకపోవడంతో అన్నదాతలు చిత్తవుతున్నారు. వర్షాలకు పత్తి తడిసిందనే కారణం చూపి వ్యాపారులు తమ చిత్తానుసారం ధరను నిర్ణయిస్తున్నారు. దీంతో ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు పత్తికి ప్రభుత్వం రూ.4,050 మద్దతు ధర ప్రకటించింది. అయితే, శనివారం సాయంత్రం వరకు క్వింటాలు పత్తికి రూ.3,500 వరకు ధర చెల్లించారు. ఆది, సోమవారాల్లో ఈ ధరను రూ.2,800లకు తగ్గించారని రైతులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రూ.5వేల కోట్లతో ధరలస్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కనీసం పత్తి కొనుగోలు ఏర్పాటు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకుండా దళారులు దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఖర్చులు కూడా కష్టమే..!
ఈ ఏడాది బ్యాంకుల ద్వారా రుణాలు అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పు చేసి పంట సాగు చేపట్టారు. జిల్లాలో ఈ ఖరీప్ సీజన్‌లో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. పశ్చిమ కృష్ణాలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో పత్తిని అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం పత్తి రెండో తీత దశలో ఉంది. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కూలీల కొరత ఏర్పడింది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తం చెల్లించి కూలీలను తీసుకువచ్చి రెండో తీత పనులను రైతులు వేగవంతం చేశారు. క్వింటాలు పత్తిని తీసి ఇంటికి చేర్చేందుకు రూ.900 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో క్వింటాలు పత్తికి ప్రస్తుతం రూ.2,800లకు మించి ధర పలకకపోవడంతో ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. ఎకరానికి ఒకటిన్నర క్వింటాళ్ల నుంచి రెండు క్వింటాళ్ల పత్తి వస్తుందని, ఈ సమయంలోనే ధరను గణనీయంగా తగ్గించారని వాపోతున్నారు. ఒకవేళ కొద్ది రోజులు పత్తిని నిల్వ చేసినా, రానున్న రోజుల్లో వ్యాపారులు ఎలా వ్యవహరిస్తారనే అంశంపై స్పష్టత లేదని పలువురు రైతులు చెబుతున్నారు.
అమలుకు నోచుకోని హామీలు
రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల కన్నా 50 శాతం ఎక్కువగా మద్దతు ధరను నిర్ణయిస్తామని సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ క్వింటాలు పత్తి ఉత్పత్తికి రూ 5,200 వ్యయం అవుతుందని ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది క్వింటాలు పత్తికి రూ.4,050లను మద్దతు ధరగా నిర్ణయించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అయితే క్వింటాలు పత్తికి రూ.7,800 ధర చెల్లించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. కనీసం ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర రూ.4,050లకు కూడా క్వింటా పత్తిని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
బెంబేలెత్తిస్తున్న వాతావరణం
అరేబియా సముద్రంలో ఏర్పడిన నిలోఫర్ తుపాను ప్రభావంతోపాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి తడిస్తే ఆవిరిసోసుకుని రంగు మారుతుందని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో పత్తి తీసేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తీసిన పత్తిని ఇంటి వద్ద నిల్వ ఉంచుకునేందుకు వీలు లేకపోవడంతో ఎంతకైనా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా భావించి వ్యాపారులు పత్తిలో 12 శాతానికి మించి తేమ అధికంగా ఉందంటూ క్వింటాలుకు రూ.2,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు రుణాలు అందజేయటంలో విఫలమైందని, అష్టకష్టాలు పడి పంటలు సాగు చేశామని, మద్దతు ధర అయినా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.