దివాకర్ రోడ్ లైన్స్‌పై క్రిమినల్ కేసు: బొత్స
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం శివారులో 45 మంది మృతికి కారణ మైన ఘోర దుర్ఘటనలో వోల్వో బస్సు యజమాని దివాకర్ రోడ్డు లైన్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సును ఆపరేట్ చేస్తున్నవారితో తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం బస్సు యజమాని హోదాలో ఉన్న జేసీ ఉమారెడ్డిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో రెండో డ్రైవర్ లేడని తేలిందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా బస్సులను తనిఖీ చేస్తోందని, లోపాలున్న వాటిని వెంటనే సీజ్ చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 601 బస్సులపై కేసులు నమోదు చేయగా, 346 బస్సులను సీజ్ చేశామని, నల్లగొండ జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులను కూడా సీజ్ చేసినట్టు వివరించారు.
మరో 4 మృతదేహాల గుర్తింపు
బస్సు దగ్ధం దుర్ఘటనలో సజీవదహనమైనవారి మృతదేహాలకు సంబంధించిన మూడో జాబితాను బుధవారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. డీఎన్ ఏ నివేదికల ఆధారంగా బుధవారం మరో 4 మృత దేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఉస్మానియా మార్చురీ వద్ద బుధవారం 11 మృతదేహాలను అధికారులు మృతుల కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇప్పటివరకూ డీఎన్‌ఏ నివేదికల ఆధారంగా 38 మృతదేహాలను గుర్తించగా.. గత మూడురోజులుగా 35 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు.