
సాక్షి, విశాఖపట్నం : ఏపీ అంతటా ఫ్యాన్ గాలి వీస్తోందని, అన్ని సర్వేలు కూడా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పేశాయి. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబు నిరాశ నిస్పృహల్లో వున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలిపారు. పదహారు రోజుల్లో చంద్రబాబు పాలన ముగియనుందని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారన్న భయంతోనే చంద్రబాబు అనైతికంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీకి 50సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా సాధనలో కేసీఆర్ సహకరిస్తారనడంలో తప్పు లేదన్నారు. హోదా విషయంలో సహకరించే పార్టీకి తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఏపీకి ప్రత్యర్థిగా చిత్రీకరిస్తూ.. చంద్రబాబు పదే పదే విమర్శలు చేయడం వల్ల తెలంగాణలో ఆంధ్రులు ఇబ్బంది పడేలా చేస్తున్నారన్నారు. ఇది మంచిది కాదంటూ వీరభద్రరావు హెచ్చరించారు.