ప్రజల ఆశలపై ముఖ్యమంత్రిచంద్రబాబు నీళ్లు చల్లారని డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం
విజయనగరంఫోర్ట్: ప్రజల ఆశలపై ముఖ్యమంత్రిచంద్రబాబు నీళ్లు చల్లారని డీసీసీ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం పట్టణంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ అంశాన్నీ నేర్చవేర్చలేదన్నారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతురుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ నమ్మించి వంచించారన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ఆంశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు మొదలిశ్రీనివాస రావు, బి.భానుమూర్తి, కోట్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏడాది పాలనలో అన్ని వర్గాలకు అవస్థలు
బొబ్బిలి: తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందని ప్రజలు ఓటేసి గెలిపించిన చంద్రబాబు ఏడాదిగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు విమర్శించారు. చంద్రబాబు ఏడాది పాలనలో వాగ్దానాలను అమలు చేయనందుకు నిరసనగా మేనిఫెస్టో ప్రతులను ఆళ్వారువీధిలోని కాంగ్రెస్ కార్యాలయం ఎదుట సోమవారం దహనం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శంబంగి మాట్లాడుతూ ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికి పోవడమేనా? అవినీతి రహిత పాలన అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ద్వారా ఈ వ్యవహారాన్ని చంద్రబాబే నడిపారన్నారు.
ఏడాదిగా రైతులు, డ్వాక్రా మహిళలను నట్టేట ముంచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతులు బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో చెరుకు రైతులకు టన్నుకు రూ.60 కొనుగోలు పన్ను తిరిగి అందిస్తే ఈ ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి జన్మభూమిలో రేషనుకార్డులకు దరఖాస్తులు తీసుకోవమే తప్ప ఒక్క కార్డు ఇప్పటికి ఇవ్వలేదన్నారు. ఆన్‌లైన్ పాలనంటే నిరంతరం దరఖాస్తులు స్వీకరించడమేనా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ముగడ వెంకటరమణ, పాలవలస సూర్యనారాయణ, రామ్మూర్తి, త్రినాథ, శ్రీనివాసరావు, రామారావు, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.