తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్: కృష్ణానదిలో అంతుచిక్కని మరణాలు... మృగాళ్ల బారిన పడి తనువు చాలించిన అబలలు కొందరైతే, బతుకు భారమై ఆత్మహత్య లకు పాల్పడేవారు మరి కొందరు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో హత్యకు గురైన వారు కొందరైతే, ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించినవారు ఇంకొందరు. ఇలా ఏడాది పొడవునా ఎందరో అభాగ్యులు, అనాథలు కృష్ణానదిలో తనువు చాలించి, చివరకు ప్రకాశం బ్యారేజి వద్ద మృతదేహాలుగా తేలుతున్నారు.
గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసులు గుర్తించిన మృతదేహాల సంఖ్య 78, వీటిలో 36 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మిగిలినవారిని బంధువులు గుర్తించారు. అంతుచిక్కని 36 మృతదేహాలను పోలీసులు నమోదు చేసుకున్నారే తప్ప వాటిమీద దర్యాప్తు చేయలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో మంతెన గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి చంపి కృష్ణా నదిలో పడవేసిన విషయం ఆరు నెలల తరువాత గాని వెలుగుచూడలేదు.
బ్యారేజి వద్ద నిఘా పెంచాలి...
ప్రకాశం బ్యారేజికి ఇరువైపులా పోలీసులు నిఘా పెంచి వాహనాల తనిఖీలు చేపట్టగలిగితే కొన్ని కేసులు చిక్కుముడి వీడగలదు. గుంటూరు జిల్లా పరిధి ప్రకాశం బ్యారేజి 36వ కానా వరకు ఉండగా, తాడేపల్లి అవుట్ పోస్టు వద్ద నుంచి 6వ కానా కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో గత సంవత్సరకాలంలో ఆత్మహత్యలకు పాల్పడబోయిన 15 మందిని పోలీసులు కాపాడగలిగారు. అలాగే అవుట్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేయడం వల్ల సంఘ విద్రోహశక్తులను అదుపులోకి తీసుకోగలిగారు. ప్రకాశం బ్యారేజిని అడ్డాగా చేసుకుని గంజాయి అమ్మకాలను కూడా నివారించగలిగారు.
అవుట్‌పోస్టు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయగలిగితే...
తాడేపల్లి పోలీసులు ప్రకాశం బ్యారేజి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టు మాదిరిగానే విజయవాడ పోలీసులు అటువైపు బ్యారేజి వద్ద అవుట్ పోస్టుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బ్యారేజిపై ఆత్మహత్యలు, హత్యలను నిలువరించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులను పట్టుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఓ ప్రేమ జంట బ్యారేజి మీద మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా ప్రియురాలు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ విషయాన్ని గమనించిన వాహనచోదకులు 100కు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిఘా అయితే పెంచారు కానీ ప్రియుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. చివరకు మృతదేహం ఎవరిదో ఈ నాటికీ గుర్తించలేకపోయారు. అదే అవుట్ పోస్టు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ప్రియుడిని ఆనాడే గుర్తించగలిగేవారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజి 34వ కానా వద్ద జీన్ ప్యాంటు, టీషర్టు ధరించిన సుమారు 20 సంవత్సరాల లోపు వయస్సు గల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఇది హత్యా, ఆత్మహత్యా, అనేది పోలీసులకే అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సంయుక్తంగా ప్రకాశం బ్యారేజి మొత్తం కనబడే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నది వద్ద చాలా వరకు హత్యలను, ఆత్మహత్యలను నిలువరించే అవకాశం లేకపోలేదు.
అంతులేని వ్యధలు మిస్టరీ మరణాలు
Published Wed, Jan 8 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement