జింకల దాడితో.. పంటలు నాశనం
వల్లూరు: రబీలో సాగు చేసిన పంటలపై జింకలు దాడులు చేసి నాశనం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాగు చేసిన పంట మొలకెత్తక ముందే జింకలు తిని వేస్తుండటం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగుచేసిన పంటలు తమ కళ్లెదుటే నాశనమవుతుంటే ఏమి చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలను సాగు చేయలేక పోయిన రైతులు రబీలో నవంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ధనియాలు, బుడ్డ శనగ , నూగు , పెసర తదితర పంటలను సాగు చేశారు.
మూడు మండలాల్లో తీవ్ర ఇబ్బందులు
వల్లూరు, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన ఈ పంటలపై జింకలు మందలు మందలుగా దాడులు చేసి తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి. మొలకెత్తిన వెంటనే పంటను తిని వేస్తుండటంతో పలువురు రైతులు తిరిగి విత్తనం పూడుస్తున్నారు. ఆరేడేళ్లుగా జింకల సమస్య ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సమస్య మరీ తీవ్రంగా మారింది.
ఆ ఆశ అడియాసే..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో మూడు మండలాల సరిహద్దుల్లో పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న విమానాశ్రయం ఆవరణలో సైతం జింకల మందలు తిరుగుతుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతాయని అధికారులు గుర్తించారు. రన్‌వేపై జింకలు తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు జింకలను అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గత ఏడాది ప్రకటించారు.
దీంతోనైనా తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశపడ్డారు. అయితే విమానాశ్రయం ప్రారంభానికి నోచుకోక పోవడంతో ఆ ఆశలు కూడా అడియాశలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జింకలను అటవీ ప్రాంతాలలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.