=మేడారం జాతర పనులపై చిన్నచూపు
=కేటాయింపులు చేసినా పైసా విడుదల చేయని సర్కార్
=ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఫైళ్లు
=సచివాలయం చుట్టూ తిరుగుతున్న జిల్లా అధికారులు
=ముంచుకొస్తున్న జాతర గడువు.. ఈ సారీ పనులు ఆగమాగమే?
మహాజాతరపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ జాతరపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఏదో అత్తెసరు నిధులకు మంజూరీ ఇచ్చినా ఇప్పటి వరకు పైసా రాలేదు. జాతరకు మూడు నెలలు మాత్రమే గడువు ఉండగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కనీసం టెండర్ దశకు కూడా చేరుకోలేదు. సరైన సౌకర్యాలు లేక ఈ సారి కూడా భక్తులకు కష్టాలే ఎదురుకానున్నాయి.
ములుగు, న్యూస్‌లైన్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 12నుంచి 15వ తేదీ వరకు జరిగే మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అధికారుల అంచనా. జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిం చింది. కలెక్టర్ కిషన్ నేతృత్వంలో రూ.114 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఎట్టకేలకు తొలుత రూ.68.62 కోట్లు, తదుపరి మరో రూ.21.5 కోట్ల నిధులు మంజూరుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
నిధుల కేటాయింపులు జరిగినప్పటికీ పైసా కూడా విడుదల కాలేదు. సదరు ఫైళ్లు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా శాఖల జిల్లా అధికారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆ ఫైళ్లకు మోక్షం లభించడం లేదు. ఫైనాన్స్ విభాగంలో క్లియరెన్స్ రావడానికి వారం.. ఆ తదుపరి టెండర్ పిలవడం.. ఓపెన్ చేయడం.. అగ్రిమెంటు..తదితరాలను ఫైనలైజ్ చేయడానికి మరింత సమయం పట్టనుంది. ఇలా.. జాతర పనుల ప్రారంభానికి మరో నెల రోజులు పట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతీసారి జరిగే జాతరల్లోనూ నిర్ణీత గడువుకు పనులు ప్రారంభంకాక పోవడం భక్తులకు శాపంగా మారింది.
జిల్లా యంత్రాంగం ముందస్తుగా స్పందిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత జాతరల అనుభవ పాఠాలను నేర్వని ప్రభుత్వం తీరుపై భక్తులు మండిపడుతున్నారు. ఈ జాతరలోనూ ఆదరాబాదరా పనులకే తెరలేవనున్నట్లు స్పష్టమవుతోంది.
ఫైనాన్స్ విభాగంలోనే..
మేడారం మహాజాతరకు ప్రభుత్వం సుమారు రూ.90 కోట్లు కేటాయించినా అందుకు సంబంధించిన ఫైళ్లు ఫైనాన్స్ విభాగంలో పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపుగా ఎక్కువ మొత్తం శాఖల పరిస్థితి ఇదే విధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని శాఖల పనులు ఇంకా టెక్నికల్ మంజూరుకు అపసోపాలు పడుతున్నాయి. జాతర పనుల్లో స్నానఘట్టాల పనులు.. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ అత్యంత కీలకవైనవి.
అయితే ఈ పనుల ఎప్పుడు కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు.. హడావుడి నిర్మాణాలతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకునేలా అధికారులే అవకాశం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం చిన్ననీటి పారుదల శాఖ పరిధిలో రూ.9.52 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించిన ఫైల్ ఫైనాన్స్ విభాగంలో ఉంది. పనుల ఫైనలైజ్ కోసం ఆ శాఖ ఈఈ హైదరాబాద్‌లోనే మకాం వేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ.9.30 కోట్లతో 80 పనులు చేపట్టనున్నారు. నిధుల మంజూరు ఫైల్ ప్రస్తుతం ఫైనాన్స్ విభాగంలో ఉందని, రెండు మూడు రోజుల్లో ఫైనల్ కానున్నట్లు ఆ శాఖ ఈఈ తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖదీ అదే పరిస్థితి
మేడారం జాతరలో రూ.9.96 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ వివిధ అభివృద్ధి పనులను చేపట్టనుంది. అయితే నిధుల మంజూరు ఫైల్ ప్రస్తుతం ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయంలో ఉంది. ఇక్కడ ఆమోదం వేయించేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోనే ఉన్నట్లు డీఈ మల్లయ్య తెలిపారు. ఇదిలాఉండగా, గత జాతరలో ఈ శాఖ చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లోనే స్పష్టమైంది. జాతర గడువు దగ్గరపడడంతో అప్పట్లో అధికారులపైనా, సదరు కాంట్రాక్టర్‌పైనా చర్యలు తీసుకోలేకపోయారు. ఆ తదుపరి మరిచిపోయారు.
ఆర్‌అండ్‌బీదీ అదే తీరు..
ఆర్ అండ్ బీ శాఖ అధికారులు అష్టకష్టాలు పడి సుమారు రూ.43కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం వేయించుకున్నారు. అయితే సదరు పనుల్లో కొన్ని టెక్నికల్ సాంక్షన్ దశలో ఉండగా మరికొన్ని ఫైనాన్స్ విభాగంలో క్లియరెన్స్ కోసం రెడీగా ఉన్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ సారి జాతరలో ట్రాఫిక్ సమస్యను తీర్చాలన్న లక్ష్యంతో ఈ శాఖకు ఎక్కువ మొత్తం నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పనుల ప్రారంభానికి కనీసం ఇంకా నెలరోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ సారీ ఆదరాబాదరా పనులు తప్పని పరిస్థితి ఉంది.
పంచాయతీరాజ్ శాఖ ముందంజ
జాతర పనులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ కొంత ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రూ.7.68 కోట్లతో ఆరు పనులు చేపట్టనుండగా దాదాపుగా అన్ని అనుమతులు వచ్చాయని.. రెండు మూడు రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆ శాఖ ఏఈ ప్రభాకర్ తెలిపారు. కన్నెపల్లి ఆర్చ్ నుంచి దేవాలయం వరకు రోడ్డుకు రూ.91 లక్షలు, చింతల్ క్రాస్ నుంచి మేడారం వరకు 4 కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు, బీటీ, మెటల్ పనులకు రూ.1.51 లక్షలు, బయ్యక్కపేట ఆర్‌అండ్‌బీ నుంచి కాల్వపల్లి వరకు సీసీ నిర్మాణానికి రూ.46 లక్షలు, నార్లాపూర్ గ్రామం నుంచి బయ్యక్కపేట మేడారం ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు వెడల్పునకు రూ.64 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీటితో పాటు మిగతా పనులకు టెండర్లు పూర్తి చేసి.. 15 రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.