ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో...
- 22న సమ్మె తేదీ ప్రకటిస్తామన్న కార్మిక సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసిచ్చిన ఈయూ-టీఎంయూ నేతలతో కార్మిక శాఖ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్ని ఈ నెల 22కి వాయిదా వేస్తూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకోవడంతో అదే రోజు సమ్మె తేదీ ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలుపేర్కొన్నారు.
ఆర్టీసీ విభజన వెంటనే చేపట్టాలని, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌లు సమ్మె నోటీసిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై యూనియన్‌ల నాయకులను కార్మిక శాఖ సోమవారం చర్చలకు పిలిచింది. అయితే యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య స్పష్టత రాకపోవడంతో చర్చలు ఈ నెల 22కి వాయిదా పడ్డాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 18న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది.
ఆ రోజున చర్చల్లో ఆర్టీసీ ఎండీ పాల్గొంటారని యూనియన్ నేతలకు సమాచారం ఇచ్చింది. సోమవారం కార్మిక శాఖ రాష్ట్ర కన్సిలియేషన్ అధికారి ఆర్.రవి భూషణరావుతో జరిగిన చర్చల్లో యూనియన్ నేతలు కె.పద్మాకర్, ఇ.అశ్వత్థామరెడ్డి, బాబు, తిరుపతి, హన్మంతరావు, కె.రాజిరెడ్డి, ఎం.థామస్‌రెడ్డి, పలిశెట్టి దామోదరరావు, ఎల్.మారయ్య పాల్గొనగా, ఆర్టీసీ యాజమాన్యం తరఫున ఈడీ ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.