సమైక్య పోరులో ఎన్జీవోల పాత్ర అనిర్వచనీయం
- డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్
అవనిగడ్డ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు పోరాడిన తీరు అనిర్వచనీయమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం దివి యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా రాష్ట్రం ముక్కలు కాకూడదనే సంకల్పంతో ఎన్జీవో సంఘ నాయకులు సీమాంధ్రలో నిర్వహించిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత జేఏసీ నాయకులు రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పదవులను చేపట్టారని, ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును వివిధ పార్టీలు ఆహ్వానించినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారని అభినందించారు.
బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఉద్యోగులంటే గతంలో తనకు సదాభిప్రాయం లేదని, సమైక్యాంధ్ర కోసం 82 రోజులపాటు వారు ఉద్యమించిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి బుద్ధి చెప్పిన ఘనత సీమాంధ్ర ప్రజలకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన బుద్ధప్రసాద్, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, అశోక్‌బాబులను సన్మానించారు.
ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ఎన్జీవో సంఘం నాయకులు దారపు శ్రీనివాస్, ఎ.విద్యాసాగర్, ఎండీ ఇక్బాల్, దివి యూనిట్ అధ్యక్షుడు బి.రాజేంద్రకుమార్, కార్యదర్శి ఎస్.వెంకట సందీప్, తూర్పు కృష్ణా నాయకుడు అబ్దుల్ అజీజ్, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల అధినేత ఎండీవీఎస్‌ఆర్ పున్నంరాజు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా), పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.