హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భోళా శంకరుడిని దర్శనానికి భక్తులు శివాలయాలకు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. హర హర మహాదేవ.. శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ భక్తులు తరిస్తున్నారు. శివ మాలధారులు భక్తులకు, స్వాములకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు పది గంటల సమయం పడుతోంది. సుమారు మూడు లక్షలమంది భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 10.30గంటలకు పాద అలంకరణ అనంతరం స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
హరహర శంభో నామస్మరణలతో దక్షిణకాశి మారుమోగిపోతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేకువజాము నుంచే మహాశివుడిని భక్తులు దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలువైపుల నుంచి తరలివచ్చిన అశేష భక్తవాహినితో ఆలయం కిటకిటలాడుతోంది. స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు, స్వామి అమ్మవార్ల సేవలో తరిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా .. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు.
చిత్తూరుజిల్లా కమ్మసంద్రలోని శ్రీకోటి లింగేశ్వరాలయం ఆధ్మాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శివరాత్రిని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. 108 అడుగుల మహా శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా శివరాత్రి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పంచారామాలైన శ్రీక్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీసోమేశ్వర జనార్థనస్వామి ఆలయం భక్తులతో పోటెత్తాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల ఎదుట బారులు దీరారు. పరమ శివుడికి బిల్వార్చన పూజ, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా .. ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, ప్రసాదం, మంచినీరు, మజ్జిగను ఏర్పాటు చేశారు.
శివరాత్రిని పురస్కరించుకుని పవిత్ర గోదావరి నదీతీరం శివనామ స్మరణలతో మారుమాగుతోంది. విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చిన శివభక్తులతో రాజమండ్రి జనసంద్రంలా మారింది. భక్తులు పుణ్యస్నానాలకు గోదావరి రేవులకు చేరడంతో రాజమండ్రిలోని కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, విఐపిఘాట్, మార్కేండయస్వామి రేవు, ఇసుక రేవులు భక్తులతో నిండిపోయాయి.
మరోవైపు కోటగుమ్మంలోని శివుని విగ్రహంతో పాటు శివాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. పంచారామక్షేత్రాలలో ఒకటైన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ గౌలిపురా మిత్రాక్లబ్‌లో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిమల దివ్యదర్శనం ఏర్పాటు చేశారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వెలిసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తుల సందర్శనార్థం ప్రతిష్టించారు. ఈనెల 25నుంచి మార్చి 1వరకు జ్యోతిర్లింగాల దివ్యదర్శనం ఉంటుంది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శనతో పాటు సాంస్క్రతిక కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉచిత మెడిటేషన్ శిబిరంతో పాటు స్పిర్చివల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లా వేయి స్థంభాల దేవాలయంలో మహశివరాత్రి ఉత్సవాలు శుభారంభమయ్యాయి.రుద్రాభిషేకంతో మొదలై ఐదురోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. వేయిస్థంభాల దేవాలయంతో పాటు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామప్ప, గణపురం కోటగుడి, కురవి వీరభ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మంజిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. కాకతీయుల కాలంనాటి కూసుమంచి శివాలయం దక్షిణభారతదేశంలోనే మూడవ అతిపెద్ద దేవాలయంగా పేరు గాంచింది. భారీగా తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Published Thu, Feb 27 2014 8:50 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement
Advertisement