
హద్దు మీరొద్దు..: డీజీపీ
సినీ అభిమానులకు హెచ్చరిక... టెలీకాన్ఫరెన్సులో ఎస్పీలకు ఆదేశాలు
సాక్షి, అమరావతి : తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదని, హద్దులు మీరి శాంతి భద్రతల సమస్యకు కారణమైతే ఉపేక్షించేది లేదని సినీ అభిమానులను డీజీపీ ఎన్.సాంబశివరావు హెచ్చరించారు. సంక్రాంతికి ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదల అవుతున్న తరుణంలో పోలీస్ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఎస్పీలతోను టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల విడుదల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రెండు సినిమాలు విడుదలవుతోన్న థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఎస్పీలను ఆదేశించారు.