నీటి కష్టాలు తీరుస్తా
‘‘జిల్లాలో నీటి సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పొలాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. చెరువుల్లో చుక్కనీరు లేకుండా పోయింది. భూగర్భజలాలు అడుగంటాయి. అయినా అధైర్యపడొద్దు. ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పడమటి మండలాలకు నీటిని తీసుకొస్తా. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను నిర్మిస్తా. నీటిసమస్యే లేకుండా చూస్తా’’ అంటూ సీఎం చంద్రబాబు బుధవారం రేణిగుంట మండలం ఆర్.మల్లవరం వద్ద జరిగిన సభలో హామీ ఇచ్చారు.
- ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా మదనపల్లెకు నీళ్లు
- నీరు-చెట్టు ద్వారా భూగర్భ జలాల పెంపు
- రెండేళ్లలో గాలేరు- నగరిని పూర్తిచేస్తా
- అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతా
- అధికారులపై తీవ్ర ఆగ్రహం
- సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన వైనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో తాగునీటి సమస్య ఉందని, దాని పరిష్కారం కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన బుధవారం రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో స్థానిక సర్పంచ్ మునిశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ ఈ ఏడాదే హంద్రీ-నీవా ద్వారా పుంగనూరు, మదనపల్లెకు నీటిని తీసుకు వస్తామన్నారు. స్వర్ణముఖి, సోమశిల లింకు కెనాల్‌ను నిర్మిస్తామన్నారు. జీఎన్‌ఎస్‌ఎస్ పనులను రెండేళ్లల్లో పూర్తి చేసి, నగరికి నీళ్లు వచ్చేలా చేస్తామన్నారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రముఖ విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశామన్నారు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్‌లు ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఆర్ మల్లవరం గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ధ చూపాలన్నారు. పట్టిసీమ, పోలవరం నీరు, రాయలసీమకు తెచ్చేవరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని చెప్పారు.
సీఎం ప్రసంగిస్తుండగానే...
ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే సగం మందికి పైగా మహిళలు వెళ్లిపోయారు. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు సభకు వచ్చిన మహిళల నుంచి లేదు లేదు అని సమాధానం రావడంతో సీఎం తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఓ దశలో ఆగ్రహంతో అధికారులపై ఊగిపోయారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ సహనం కోల్పోయారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలను సైతం సీఎం మందలించారు. సభ నిర్వహణపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖం చాటేసిన అధికారులు
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సీఎం సభకు అధికారులంతా హాజరయ్యారు. అయినప్పటికీ వారు వేదికపైకి వెళ్లకుండా ముఖం చాటేశారు. సీఎం పలుమార్లు ఇక్కడ అధికారులు ఎవరంటూ ప్రశ్నించినప్పుడు వేదిక దగ్గరగా ఉన్న అధికారులు వణికి పోయారు. సీఎం దగ్గరకు వెళితే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని వెళ్లకుండా ఉండిపోయారు. సమావేశానికి కలెక్టర్ తప్ప మిగిలిన ఉన్నతాధికారులందరూ హాజరయ్యారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ వేదిక పైకి వెళ్లలేదు. సీఎం ప్రసంగానికి ఆశించిన మేర స్పందన కరువైంది. చెరుకు రైతులు బకాయిలు చెల్లించాలని సీఎంను నిలదీశారు.