
డిగ్గీ టూర్ విఫలం
డిగ్గీ రాజా రాయబారాలు విఫలమయ్యాయి... కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రాలేదు... సీమాంధ్ర పార్టీ నేతల్లో స్థైర్యం నిండలేదు... తెలంగాణ నేతలు ఒక్కతాటిపైకి రాలేదు... దీంతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నిరాశానిస్పృహలతో వెనుదిరిగారు.
మూడు రోజుల్లో నెరవేరిందేమీ లేదు
రాయబారాలు, పొత్తులు విఫలం
సీమాంధ్ర నేతల్లో కనపడని స్థైర్యం
గాంధీభవన్‌వైపు చూడని
తెలంగాణ సీనియర్ నేతలు
నిరాశా నిస్పృహలతోనే తిరిగి ఢిల్లీకి
సాక్షి, హైదరాబాద్: డిగ్గీ రాజా రాయబారాలు విఫలమయ్యాయి... కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ పార్టీ ముందుకు రాలేదు... సీమాంధ్ర పార్టీ నేతల్లో స్థైర్యం నిండలేదు... తెలంగాణ నేతలు ఒక్కతాటిపైకి రాలేదు... దీంతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నిరాశానిస్పృహలతో వెనుదిరిగారు. మంచైనా, చెడైనా మీదే బాధ్యతంటూ స్పష్టంచేసి ఢిల్లీ వెళ్లిపోయారు. తనకు వీడ్కోలు చెప్పేందుకు నేతలు విమానాశ్రయానికి వచ్చేందుకు కూడా అంగీకరించలేదు. రెండు పీసీసీలను ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా చేయడంతో పాటు తెలంగాణలో పార్టీనేతల్లో తలెత్తిన అసంతృప్తిని పోగొట్టి ఏకం చేయడం, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులను కొలిక్కి తేవడం, అలాగే కాంగ్రెస్‌తో కలసి వచ్చే ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు చేయడం వంటి ఎజెండాతో ఆయన గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడంతో ఆ పదవిని ఆశించిన సీనియర్ నేతలు జానారెడ్డి, డి.శ్రీనివాస్ సహా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీనుంచి హైదరాబాద్‌కు వచ్చినా కనీసం అభినందనలూ తెలుపలేదు. అసంతృప్త నేతలను సముదాయించేందుకు దిగ్విజయ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దిగ్విజయ్ నిర్వహించిన సమావేశానికి హాజరవ్వడమే తప్ప ఆ తరువాత ఎవరి దారి వారిదేనన్నట్లు వెళ్లిపోయారు. చివరకు దిగ్విజయ్‌సింగ్ జానారెడ్డి ఇంటికి విందు సమావేశానికి వెళ్లినా ఫలితం లేకపోయింది.
దిగ్విజయ్ నగరంలోనే ఉన్నా, మూడోరోజున దాదాపు మూడునాలుగు గంటలసేపు గాంధీభవన్‌లోనే ఉన్నా తెలంగాణ సీనియర్ నేతలు అక్కడికి రాలేదు. పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు టికెట్లు ఆశించే ద్వితీయశ్రేణి నేతలుతప్ప ఇంకెవరూ కనిపించలేదు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కొందరు గాంధీభవన్‌కు వచ్చినా దిగ్విజయ్‌ను కలసి తమకు మళ్లీ అవకాశమివ్వాలని కోరి ఆ వెంటనే వెళ్లిపోయారు. ఇక టీఆర్‌ఎస్‌తో పొత్తుల వ్యవహారాన్ని కూడా తన చర్యలతో దిగ్విజయ్ ప్రహసనంగా ముగించారు. చివరకు తెగతెంపులు అయిపోయేలా చేశారని సొంతపార్టీ నేతలనుంచే విమర్శలు ఎదురయ్యాయి. టీఆర్‌ఎస్‌తో పొత్తులు కుదుర్చుకోవడానికి అంటూ ఆ పార్టీ పొత్తుల కమిటీ చైర్మన్ కె.కేశవరావుతో దిగ్విజయ్ పలుమార్లు ఫోన్లలో మంతనాలు జరిపారు. అంతకుముందు కేకేను ఢిల్లీకి పిలిచినా ఆయన రాబోమని స్పష్టంచేయడంతో హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ తనంతట తానే కేకేతో మాట్లాడారు. కేసీఆర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినా అక్కడినుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆయనకు దిమ్మతిరిగినంత పనైంది. తాము పెట్టిన కండిషన్లకు అంగీకరిస్తేనే పొత్తులపై తాను మట్లాడతానని కేసీఆర్ స్పష్టంచేయడంతో ఇక దిగ్విజయ్ ఏమీ చేయలేక మౌనం దాల్చారు. చివరకు కేకే ద్వారా దిగ్విజయ్ నడిపిన రాయబారాలు ఫలించలేదు. ఓవైపు టీఆర్‌ఎస్‌తో పొత్తులపై చర్చలంటూనే మరోవైపు పార్టీ నేతలు ఒంటరిపోటీకి కూడా సిద్ధంగా ఉండాలని దిగ్విజయ్ పేర్కొనడం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం వంటివి మొదటికే మోసం తెచ్చాయి. దిగ్విజయ్ చర్యలతో తీవ్ర అసహనానికి గురైన కేసీఆర్ కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకుంటామని పొత్తులు లేవని కరాఖండీగా ప్రకటించారు. ఇక సీపీఐతో పొత్తులకోసం నారాయణతో దిగ్విజయ్ జరిపిన మంతనాలు కూడా ఫలించలేదు. సీపీఐ, న్యూడెమొక్రసీ పార్టీలను కలుపుకొని వెళ్దామనుకున్నా ఆ చర్చలకూ ఆస్కారం కలగలేదు.
మీరెవ్వరూ నాతో రావద్దు:
కార్యక్రమాలన్నీ ముగిసిన అనంతరం దిగ్విజయ్‌సింగ్ సాయంత్రం నాలుగు గంటలకు విమానాశ్రయం చేరుకొని ఢిల్లీకి చేరుకోవాలి. విమానాశ్రయం వరకు వెళ్లి ఆయనకు వీడ్కోలు చెబుదామని ఇరుప్రాంత పీసీసీ నేతలు భావించారు. అయితే అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న దిగ్విజయ్ తనతోపాటు ఎవరూ రావద్దని చెప్పేశారు. తానొక్కడినే విమానాశ్రయానికి వెళ్తానంటూ వె ళ్లిపోయారు. ఒకరిద్దరు నేతలు ఆయనకు వీడ్కోలు పలికేందుకు వెళ్లినా సీనియర్లలో అనేకమంది ఎవరి ఇళ్లలో వారుండిపోయారు.
సీమాంధ్రలోనూ అదే పరిస్థితి
మరోవైపు సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, నేతలను ఉత్సాహపర్చాలని దిగ్విజయ్ చేసిన ప్రయత్నాలకు స్పందన కరువైంది. ఆ ప్రాంతనేతలంతా మూకుమ్మడిగా పార్టీ అధిష్టానం తీరును తప్పుబట్టారు. తెలంగాణపై హడావుడిగా చేసిన నిర్ణయం, విభజన తీరుతో చేజేతులా పార్టీని నాశనం చేశారని దిగ్విజయ్ ముఖమ్మీదనే చెప్పేశారు. ఇరుప్రాంతాల్లోనూ పార్టీని నష్టపరిచారని ఆవేదన వ్యక్తపరిచారు. సీమాంధ్రలో పార్టీలో ఎవరూ మిగల్లేదని స్పష్టంచేశారు. నేతల్ని ఉత్సాహపరుద్దామని చూసిన దిగ్విజయ్‌సింగ్‌కు వారు చెప్పిన మాటలు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనుచేశాయి. దిగ్విజయ్‌సింగ్ నిర్వహించిన సమావేశాలకు ఏపీసీసీ కమిటీలో స్థానం పొందిన నేతలు సైతం గైర్హాజరయ్యారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, చింతామోహన్, కిశోర్ చంద్రదేవ్, జేడీ శీలం, కన్నా లక్ష్మీనారాయణలు రాలేదు. గతంలో దిగ్విజయ్‌లాంటి నేతలు వస్తున్నారంటే గాంధీభవన్ సీనియర్ నేతలతో హడావుడిగా ఉండేది. గాంధీభవన్ చుట్టూరా పోలీసులు మోహరించేవారు. వారి వద్దకు కేవలం సీనియర్ నేతలను మాత్రమే అనుమతించేవారు. మిగతా నేతలను గాంధీభవన్ లోపలకు కూడా అనుమతించకుండా పోలీసులు బయటే ఆపేసేవారు. కానీ ఇప్పుడు సీనియర్ నేతలే కాదు కదా? సీమాంధ్రకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు సైతం కనిపించలేదు. ఎప్పుడూ తన గదికే పరిమితమై ఉండే దిగ్విజయ్ ఈ మూడు రోజులూ గాంధీభవన్ ఆవరణ బయటకు సైతం వచ్చి నవ్వుతున్నట్లు కనిపించే ముఖంతో అక్కడి జనాలను పలకరిస్తూ కలియదిరిగారు. వారు అందించే వినతిపత్రాలను స్వయానా తానే స్వీకరిస్తూ ఆదరంతో పలకరిస్తూ కనిపించారు. ఈ పరిస్థితిని చూసి విస్మయం చెందడం పార్టీనేతల వంతైంది. తెలంగాణ ఇచ్చినందున ఆ ప్రాంత నేతల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబుకుతుందనుకుంటే అలాంటిదేమీ లేకపోవడం, గాంధీభవన్‌కు వచ్చిన వారినుంచి సైతం పెద్దగా స్పందన లేకపోవడంతో దిగ్విజయ్ చివరిరోజున తీవ్ర అసహనానికి లోనైనట్లు కనిపించారు.