మరో ఏడాది డీజీపీగా కొనసాగించండి
క్యాట్‌ను ఆశ్రయించిన దినేష్‌రెడ్డి.. నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు తననే డీజీపీగా కొనసాగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాష్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డీజీపీగా నియమితులైన అధికారిని రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా రెండోసారి 2012లో నియమితుడినైన తనకు ఈ తీర్పు వర్తిస్తుందని, ఇప్పటికే ఇతర రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయని డీజీపీ క్యాట్ దృష్టికి తెచ్చారు.
సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ తనను మరో ఏడాదిపాటు కొనసాగించాలని కోరుతూ ఈ నెల 21న రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాతపూర్వకంగా వినతిపత్రం ఇచ్చానని, అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని తెలిపారు. వచ్చే నెలాఖరు నాటికి పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. క్యాట్‌లో తన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకూ తనను డీజీపీగా పదవీ విరమణకు అనుమతించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని దినేష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.