పుష్కర యాత్రికులకు భోజన ఏర్పాట్లు
అధికారులతో సమీక్షలో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర యాత్రికులకు సేవలు, ఇతర ఏర్పాట్లపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్షయపాత్ర, టీటీడీ సహకారంతో భోజనాలు, ఇతర ఆహార పదార్థాలు శుచిగా, రుచిగా అందించాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో రోజుకు లక్ష మందికి భోజన వసతి కల్పించాలన్నారు.పుష్కరాలు జరిగే 12 రోజులు కృష్ణా నదిలో జలక్రీడలు నిర్వహించాలని చెప్పారు.
ప్రధాని, రాష్ట్రపతులకు ఆహ్వానం..
పుష్కరాలకు ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్లు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు తదితరులను వీఐపీలుగా ఆహ్వానించాలని నిర్ణయించారు.
అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తుపై సీఎం సమీక్ష
అగ్రిగోల్డ్ సంస్థ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసం నుంచి సమీక్షించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలుండాలని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో జరిగిన ప్రమాదపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని హైదరాబాద్ జంట నగరాల టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఆయన మీడియా సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.