ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో రేపటి నుంచి చర్చకు అనుమతించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో రేపటి నుంచి చర్చకు అనుమతించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్చ వచ్చే శుక్రవారం వరకూ కొనసాగించాలని తీర్మానించినట్లు సమాచారం. అప్పటివరకు సమయం సరిపోకపోతే బిఏసి మళ్లీ శుక్రవారం సమావేశం చర్చకు సమయాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. మళ్లీ జనవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలివిడత సమావేశాల తేదీలను స్పీకర్ రేపు ప్రకటించే అవకాశం ఉంది.
శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, టిడిపి, టిఆర్ఎస్,సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, లోక్సత్తా పార్టీల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ బిల్లుపై చర్చ విషయంలో అధికార పార్టీకి చెందిన నేతలతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముందు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి, ఆ తరువాతే చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్ సిపి కోరింది. అందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. కొందరు శాసనసభ సమావేశాలను రేపటితో వాయిదా వేసి, జనవరి 2 లేక 3 తేదీలలో ప్రారంభించాలని కోరారు. అందుకు తెలంగాణ నేతలు అంగీకరించలేదు. రేపటి నుంచే చర్చ కొనసాగించాలని పట్టుపట్టారు. అసలు బిల్లు సభలో ప్రవేశపెట్టడమే నిబంధనలకు విరుద్దంగా జరిగిందని టిడిపి సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కొంత సమయం తరువాత బిల్లుపై చర్చ జరగాలన్నారు.