టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం | Dispose of irrigation projects under the control of News | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం

Published Fri, Mar 13 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం

టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం

  • శాసనసభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల ధ్వజం
  • నికర జలాలు రాకుండా పోయింది మీ హయాంలోనే
  • హంద్రీ నీవా మెయిన్ కెనాల్ తక్షణమే పూర్తిచేయండి
  • మండిపడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట
  • 2016కల్లా హంద్రీ నీవా పూర్తిచేస్తామన్న మంత్రి దేవినేని
  • సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని కరువు కాటకాల్లోకి నెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. తొలుత రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజక వర్గం సాగు, తాగునీటికి కటకటలాడుతోందని, హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనుల ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

    ఈ కెనాల్‌కి సంబంధించి ఇప్పటివరకూ ఏఏ పనులు కొనసాగించారో చెప్పాలని ప్రశ్నించారు. మదనపల్లి, పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లు పూర్తిచేయడంపై తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ముందుగా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేయాలన్నారు. పుంగనూరు, మదనపల్లి బ్రాంచ్ కెనాల్‌లు తక్షణమే పూర్తిచేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలు డిమాండ్ చేశారు. 1,500 అడుగులు బోర్లు వేసినా నీళ్లు లేవని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

    ఈ కెనాల్‌లు పూర్తిచేయడం వల్ల లక్షలాది ఎకరాలు సాగు అవుతుందని పేర్కొన్నారు. దీనికి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా బదులిస్తూ, అప్పటి వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించలేకపోవడం వల్లే నికర జలాలు కోల్పోయామని చెప్పారు. పులివెందుల రైతులు తమ ప్రాంతానికి నీళ్లివ్వాలని కోరడంతో కుప్పం నియోజకవర్గానికి ఆపైనా సరే పులివెందులకు నీళ్లు ఇవ్వాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హంద్రీ నీవా సుజల ప్రాజెక్టు రెండో దశకు ఇప్పటివరకూ రూ. 2,893 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ. 1,216 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశకు ఇంకా 5,481 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని దేవినేని ఉమా సమాధానమిచ్చారు. 2015-16 నాటికి హంద్రీ నీవా మెయిన్ కెనాల్ పనులు పూర్తిచేస్తామన్నారు.
     
    ఇళ్లు మేం కడితే కిటికీలు పెట్టి షోకులా?

    నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్రంగా ఆక్షేపించారు. 1994 నుంచి 2004 వరకూ అస్యూర్డ్ వాటర్(నికరజలాలు) రాకపోవడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని గడికోట శ్రీకాంతరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నీ 70 శాతానికి పైగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఇళ్లు మేము పూర్తిచేస్తే, కిటికీలు మీరు పెట్టుకుని షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాకముందే ఆలమట్టి ఎత్తు పెంచారని, అప్పట్లో కర్ణాటకకు సరైన కౌంటర్ ఇవ్వలేక ఇప్పుడు బురదజల్లే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement