స్వైన్ ఫ్లూనకం | District central government hospital ward treatment swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూనకం

Published Wed, Feb 4 2015 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

స్వైన్ ఫ్లూనకం

స్వైన్ ఫ్లూనకం

సజిల్లాలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే అధికారికంగా
 7 అనుమానిత కేసులు నమోదు కాగా, బాధితులకు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురి నుంచి శాంపిల్స్ (వైరస్ కల్చర్ స్వాప్స్) సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటివరకూ నమోదైన స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులలో విద్యార్థులే  అధికంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినవారు కాకుండా ఈ లక్షణాలు కలిగిన మరో ఇద్దరు హేలాపురి వాసులు కూడా ఉన్నారు. ఏలూరు బెనర్జీపేటకు చెందిన వి.ప్రసాద్‌బాబు, తూర్పువీధికి చెందిన ఆర్.జగదీశ్వరరావు హైదరాబాద్ పంపించే నిమిత్తం శాంపిల్స్ ఇచ్చి మందులు వాడుతున్నారు.      
 
 చింతలపూడిలో విద్యార్థికి..
 చింతలపూడి మండలం భట్టువారిగూడెంకు చెందిన బసవ మణిదుర్గారావు (14) స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 6వ తరగతి చదువుతున్న ఇతడు ఫిబ్రవరి 1న హైదరాబాద్‌నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. విపరీతమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఉదయం అతడిని చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడి పరిస్థితిని చూసి స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ అతడిని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించి తక్షణ చికిత్స ప్రారంభించారు. బాలుడి గొంతు నుంచి వైరస్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు.
 
 పాలకొల్లులో మహిళకు..
 పాలకొల్లు మండలం యాళ్లవానిగరువు గ్రామానికి చెందిన బీడెల్లి లిల్లీ (28) అనే మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతుండటంతో మంగళవారం ఏలూరు తరలించారు. పది రోజులుగా ఆమె జలుబు, జ్వరం,డయేరియా, వాంతులతో బాదపడుతూ పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొం దింది. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాకపోవడంతో అక్కడి వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో పాలకొల్లు ఏరియా ఆసుపత్రికి పంపించగా, అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అదే అనుమానంతో ఆమెను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 కామవరపుకోట, ద్వారకాతిరుమల మండలాల్లో..
 ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామానికి చెందిన నిట్టా రవిరాజ్‌కుమార్ (26), కామవరపుకోటకు చెందిన వైట్ల ఆదినారాయణ (26) మంగళవారం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ఆసుపత్రిలో చేరారు. వీరిద్దరూ కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. వీరిని పరీక్షించిన ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ పంపారు. బాధితులను స్వైన్‌ఫ్లూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ కె.శంకరరావు వారిని పరీక్షించారు. రోగులెవరూ భయపడాల్సిందేమీ లేదని, చికిత్స చేస్తున్నామని, అందరూ త్వరలోనే కోలుకుంటారని అయన భరోసా ఇచ్చారు.
 
 కోలుకుంటున్న విద్యార్థి
 సోమవారం స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఏలూరు ఆసుపత్రిలో చేరిన గోపాలపురం విద్యార్థి కోలుకుంటున్నాడని ఆసుపత్రి సూపరింటెండెండ్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ చెప్పారు. వ్యాధి నిర్థారణ కోసం ఆ విద్యార్థి గొంతు నుంచి వైరస్ కల్చర్ స్వాప్ సేకరించి హైదరాబాద్ పంపించామని చెప్పారు. బాలుడికి టామీ ఫ్లూ మాత్రలు, యాంటీ బయోటిక్స్ మందులు వాడుతున్నామని చెప్పారు. అతడు త్వరలోనే కోలుకుంటాడని అన్నారు.
 
 చికిత్స కంటే నివారణ సులభం : మోహన్
 స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగా నివారించడమే సులభమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ పేర్కొన్నారు.  వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. స్వైన్ ఫ్లూ వ్యాధి దగ్గు, తుమ్ములు, జలుబు, స్వేదం వంటి వాటిద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్ల ప్రజలు, విద్యార్థులు గుంపులుగా తిరగకూడదన్నారు. మొహా నికి మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నిరోధించవచ్చన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు సాధ్యమైనంత వరకూ త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.
 
 వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు టామీ ఫ్లూ మాత్రలు, సిరప్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో 7 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశామని, పేషెంట్లు పెరిగినా వార్డుల విస్తరణకు కావాల్సిన గదులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వ్యాధి మూడు కేటగిరీలలో ఉంటుందన్నారు. అందులో ఏ, బీ స్థారుులు ప్రమాదకరం కాదన్నారు. సీ కేటగిరీలో మాత్రం ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. అలాంటి వారు ఆసుపత్రికి వచ్చినా కృత్రిమ శ్వాస ఇచ్చి చికిత్స నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement