ఆగని మృగాళ్ల ఆకృత్యాలు | Do not stopped sexual attacks | Sakshi
Sakshi News home page

ఆగని మృగాళ్ల ఆకృత్యాలు

Published Mon, Nov 18 2013 2:46 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Do not stopped sexual attacks

చండూరు, న్యూస్‌లైన్:  మృగాళ్ల ఆకృత్యాలు ఆగడం లేదు. పాల కులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన వీరి కామవాంఛకు అమాయక మహిళలు, బాలికలు బలవుతూనే ఉన్నారు. జిల్లాలోని వేర్వేరు చోట్లా  గర్భిణీ, యువతి  లైంగికదాడికి గురయ్యారు.  చండూరు మండలం శిర్దేపల్లిలో ఒంటరిగా ఉన్న గర్భిణీపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓ మహిళ ( మూడు నెలల గర్భవతి) శనివారం తన పత్తి చేనులో పత్తి ఏరుతోంది. అదే గ్రామానికి చెందిన బొల్లం సత్తయ్య సమీపంలో కౌలుకు తీసుకున్న భూమిలో గొర్రెలను మేపుతున్నాడు. మధ్యాహ్న సమయంలో ఆ ప్రాంతంలో వీరిద్దరు తప్ప మరెవరూ లేరు. ఇదే అదునుగా భావించిన సత్తయ్య ఆ మహిళ వద్దకు వెళ్లి మాట్లాడుతున్నట్టుగా నమ్మబలికి ఒక్కసారిగా మీదపడి లైంగిక దాడి చేశాడు. ఆమె రక్షించమంటూ కేకలు వేసినా ఆమె గోడును పట్టించుకునే వారు కరువయ్యారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరిస్తూనే కిందపడిపోయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే సీఐ రజితారెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌లు బాధితురాలితో లిఖితపూర్వక ఫిర్యాదు తీసుకున్నారు. గ్రామంలో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 376(2)18 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
 తాటిపాములలో యువతిపై ..
 తాటిపాముల (తిరుమలగిరి): వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన తిరుమలగిరి మండలం తాటిపాములలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి ఒంటరిగా కట్టెలు తీసుకురావడానికి సమీపంలో వ్యవసాయ బావివద్దకు వెళ్లింది. అయితే అదే గ్రామానికి చెందిన ఎర్ర రమేష్ అనే వ్యక్తి ఇది గమనించాడు. యువతి వెంటే వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కట్టెలు కొడుతున్న యువతిని లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయగా సమీప బావుల వద్ద ఉన్న రైతులు రావడంతో రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ పార్థసారథి, ఎస్‌ఐ బి.ప్రసాదరావు గ్రామంలో విచారణ జరిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement