కనుమరుగు | Do not use toilets | Sakshi
Sakshi News home page

కనుమరుగు

Published Mon, Nov 9 2015 12:42 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

కనుమరుగు - Sakshi

కనుమరుగు

ఉండీ ఉపయోగం లేని మరుగుదొడ్లు     
నిర్మాణం పూర్తయినా తాళాలు తీయరు
నీటి వసతి అంతంతమాత్రమే     
ఇక్కట్లపాలవుతున్న విద్యార్థినులు

 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు మరుగు దొడ్లు లేక ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు, సర్వశిక్షాఅభియాన్
 ద్వారా మరుగుదొడ్లు నిర్మించినా వాటికి తాళాలు వేసి ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఉన్నత
 పాఠశాలల్లో చదివే విద్యార్థినుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు.
 ఇంకొన్నిచోట్ల పైప్‌లైన్ ఉన్నా సక్రమంగా పనిచేయడం లేదు. మరుగుదొడ్లకు తలుపులు విరిగిపోతే మరమ్మతులు చేయించని
 పరిస్థితి నెలకొంది. పలు ఉన్నత పాఠశాలలను ‘సాక్షి’ బృందం పరిశీలించగా ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
 
మచిలీపట్నం : సర్కారు పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. స్వచ్ఛ భారత్ పేరిట పాఠశాలల్లో కార్యక్రమాలు చేయడం తప్ప అక్కడి ఆడపిల్లలు పడే ఇబ్బందులను పట్టించుకోకుండా ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు విస్మయం గొల్పుతోంది. సర్వశిక్షా భియాన్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జిల్లాలోని 3,224 పాఠశాలల్లో 1,105 మరుగుదొడ్లు నిర్మించారు. జిల్లాలో 458 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 70 వేల మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. గెయిల్, బీహెచ్‌ఈఎల్, ఓఎన్‌జీసీ, బెల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి తాళాలు వేసి హెచ్‌ఎంలకు అప్పగించారు. అయితే వాటిని ఇంకా ప్రారంభించకపోవడం గమనార్హం. సర్వశిక్షాభియాన్ లెక్కల ప్రకారం 40 మంది పిల్లలకు ఒక మరుగుదొడ్డి, ఒక బాత్‌రూమ్ ఉండాలి. ఇప్పటి వరకు 1,105 మరుగుదొడ్లు నిర్మించగా, మరో 130 నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు.

మచిలీపట్నం నియోజకవర్గంలో గుండుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వరంగ సంస్థ ఇటీవల ఆడపిల్లల కోసం మరుగుదొడ్లను నిర్మించింది. వీటిని ప్రారంభిం చకుండా తాళం వేసి ఉంచారు. చిన్నాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లు చుట్టూ వర్షపునీరు, వృధా నీరు చేరి తటాకాన్ని తలపిస్తోంది.

తిరువూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నీటి వసతి లేదు. నీటి కుండీ పనిచేయడం లేదు. ఎ.కొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నీటి వసతి సక్రమంగా లేదు.

కంకిపాడు మండలంలోని పునాదిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 261 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడ కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. కాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూడు మరుగుదొడ్లను ఓఎన్‌జీసీ సంస్థ నిర్మించింది. వీటికి తాళాలు వేసి ఉంచారు.

తోట్లవల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 250 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉండగా వీటిలో ఒకటి పాడైంది. పామర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 341 మంది విద్యార్థినులు ఉన్నారు. మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. నీటి సదుపాయం సరిగా లేదు.

మోపిదేవి మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. మరుగుదొడ్లకు వెళ్లే దారి వెంబడి పిచ్చిమొక్కలు మొలిచి విషసర్పాలు సంచరిస్తున్నాయి.
 
గుడివాడ పట్టణంలోని ఏకేసీపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 410 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఎనిమిది మరుగుదొడ్లు ఉన్నాయి. వీటికి తలుపులు లేవు. నీటి వసతి లేదు. బాత్‌రూమ్‌కు వెళ్లాలంటే విద్యార్థినులు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
 
జగ్గయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించినా అవి ఇరుకుగా ఉండటంతో విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. పెనుగంచిప్రోలు మండలం అనిగళ్లపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. వత్సవాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement