దీపావళికి బాణాసంచా కాల్చొద్దు: చంద్రబాబు
విశాఖ : దీపావళికి ఎవరూ బాణాసంచా కాల్చవద్దని, దీపాలు పెట్టి పండుగ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ చెత్త ఉన్నందున, బాణాసంచా కాల్చితే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారముందన్నారు. ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలని, అవసరమైతే అందరికీ దీపాలు సరఫరా చేస్తామన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొంటూ పండుగ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీపావళి కంటే ముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
ఉత్తరాంధ్ర ప్రజల సహకారం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. నిన్న విశాఖలో 40 నిమిషాల పాటు తాగునీరు ఇచ్చామని, శనివారం గంటసేపు ఇవ్వాలని చెప్పామని ఆయన తెలిపారు. విద్యుత్ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందన్నారు. డీజిల్, పెట్రోల్పై ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. ఇంకా చాలాచోట్ల చెట్లను తొలగించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో తనకు ఇంకా సంతృప్తి లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందిరతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. టెలి కాన్ఫరెన్స్లతో నిరంతరం సమీక్షలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
ఒక వెబ్సైట్ ద్వారా చెట్ల తొలగింపు, ఇతర కార్యక్రమాలకు కావల్సిన కార్మికులను అందిస్తామని, ఎవరైనా వెబ్సైట్లోకి లాగిన్ అయితే వారికి వృత్తి కార్మికులను అందిస్తామని చంద్రబాబు తెలిపారు. విశాఖను పునర్ నిర్మించడానికి అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యువత అంతా ముందుకు రావాలని కోరారు. విరాళాలు ఇస్తారా? లేక శ్రమదానం చేస్తారా అనేది వారి ఇష్టమన్నారు. హుదూద్ కూడా అసూయ పడేలా విశాఖ నగరాన్ని గతంలో కంటే సుందరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.
విద్యుత్, గ్యాస్, తాగునీరు ... వీటన్నింటిని అండర్ గ్రౌండ్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. దీనికోసం కన్సల్టెన్సీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇన్ఫోసిస్ రూ.5 కోట్లు విరాళం ఇచ్చిందని, ఒక గ్రామాన్ని కట్టడానికి ముందుకు వచ్చినట్లు బాబు తెలిపారు. తుఫానులను తట్టుకునే విధంగా కాలనీల నిర్మాణం చేస్తామని ఆయన పేర్కొన్నారు.