సాక్షి, కడప : జిల్లాలో వేల సంఖ్యలో డ్రాపౌట్స్(బడిబయటిపిల్లలు) ఉన్నా అధికారుల లెక్కలు చూస్తే ఆశ్చర్య పోవలసిందే. డ్రాపౌట్స్ విషయంలో రాజీవ్ విద్యామిషన్ అధికారులు కాకి లెక్కలు చెబుతూ మభ్య పెడుతూనే ఉన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కడపలో కేవలం నలుగురు బాలురు మాత్రమే ఉన్నట్లు ఆర్వీఎం జాబితా చెబుతోంది. ప్రొద్దుటూరులో అసలు బాలురే లేరని పేర్కొంటున్నారు. నలుగురు బాలికలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మైదుకూరులో ఓ డ్రాపౌట్ కూడా లేరని తేల్చారు.
తప్పుడు నివేదికలు
జిల్లాలో 3026 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు గత ఏడాది ఆర్వీఎం అధికారుల సర్వేలో తేలింది. వీరిలో 974 మందిని వివిధ పాఠశాలల్లో, 962 మందిని కస్తూర్బా పాఠశాలల్లో చేర్చినట్లు లెక్కలు చెబుతున్నారు. విద్యా పక్షోత్సవాలు, బడిబాట, సీఆర్‌పీల ద్వారా మిగిలిన పిల్లలను బడిలో చేర్చగా, కేవలం 237 మంది మాత్రమే మిగిలారని లెక్క తేల్చారు. ఈ మేరకు నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపారు.
ఆర్‌ఎస్‌టీసీలకు మంగళం
2011-12 సంవత్సరంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో 61 ఆర్‌ఎస్‌టీసీలను నడిపారు. 2012-13లో వీటి సంఖ్య 13కు కుదించారు. జిల్లాలో కేవలం 237 మంది డ్రాపౌట్స్ ఉన్నందున వీరికోసం ఐదు ఆర్‌ఎస్‌టీసీలు మాత్రమే నడపాలని ఆర్వీఎం అధికారులు తొలుత నిర్ణయించారు. అయితే ఈ డ్రాపౌట్స్ జాబితాను చూసి ఎన్జీఓలతోపాటు పలువురు అవాక్కయ్యారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఎలా తేవాలో అర్థంగాక ఆర్‌ఎస్‌టీసీలను నడపలేమంటూ చేతులు ఎత్తేశారు. దీంతో 2013-14కు సంబంధించి జిల్లాలో ఆర్‌ఎస్‌టీసీలే లేకుండా పోయాయి. జిల్లాలో వందలాది మంది బడి బయట పిల్లలు ఉన్నారని తమకు ఆర్‌ఎస్‌టీసీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆర్వీఎం అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారని ఎన్జీఓలు సైతం పెదవి విరుస్తున్నారు. ఒక్క కడప నగరంలోనే వెయ్యి మందికి పైగా డ్రాపౌట్స్ ఉంటారని, అయితే నలుగురు మాత్రమే ఉన్నారని లెక్కలు చెప్పడం విచిత్రంగా ఉందని పేర్కొంటున్నారు. ఆర్వీఎం అధికారులు శాస్త్రీయంగా సర్వే చేసి బడిబయట పిల్లలకు న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వే చేస్తున్నాం
బడి బయటి పిల్లల కోసం సర్వే చేస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో రూరల్ ప్రాంతాల్లో ఎన్జీఓల ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. సర్వే అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
- జయసుబ్బారెడ్డి, ఏఎల్‌ఎస్ కో ఆర్డినేటర్
డ్రాపౌట్స్... 237
Published Mon, Dec 23 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement