
'చంద్రబాబు బాటలోనే పవన్ కల్యాణ్'
కాకినాడ : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏవిధంగా మోసం చేస్తున్నారో పవన్ కల్యాణ్ కూడా అదేవిధంగా ప్రజలను మోసం చేశారని ఆయన గురువారమిక్కడ అన్నారు. అవినీతిపై ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పరిపాలన గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.
కాకినాడలో ధర్నాలో పాల్గొన్న ద్వారంపూడి మాట్లాడుతూ ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఈ రోజు వరకు కనిపించడం లేదని అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ఏసీ గదుల్లో కూర్చుని ముఖానికి రంగులేసుకుని పవన్ నటిస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల్లోకి వస్తే సమస్యలు అర్థం అవుతాయని ద్వారంపూడి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ద్వారంపూడి తెలిపారు.