ఈ సారైనా.. పాస్ అయ్యేనా?
ఈ పద్ధతిలో జిల్లాలో 2 లక్షల మందికే సరకులు
6.5 లక్షల మందికి పాతపద్ధతిలోనే పంపిణీ
మే 1 నుంచి ఏజెన్సీలో కూడా అమలు
సాక్షి, విశాఖపట్నం : ఈ-పాస్ విధానం జిల్లాలో తుస్సుమంది. అధికారులను.. డీలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక సామాన్యప్రజల సహనానికి పరీక్షగా నిలిచింది. ప్రారంభించిన తొలి నెలలో నాలుగో వంతు మందికి మించి ఈ మెషీన్ల ద్వారా సరకులు అందించలేని దుస్థితి ఏర్పడింది. మిగిలిన వారికి పాతపద్ధతిలోనే సరకులు పంపిణీ పూర్తి చేయడంతో గండం గడిచి పిండం బయట పడినట్టయ్యింది. జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల పరిధిలో 274 రేషన్‌షాపులో ఈ నెల 1వ తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) విధానానికి శ్రీకారం చుట్టారు.
తొలి రోజు నుంచి దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయిపోవడం, సెల్‌నెట్‌వర్క్ సిగ్నెల్స్ పనిచేయకపోవడం, మెషీన్లు మొరాయించడం వంటి సమస్యలతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. రోజుకు పట్టుమని పదిమందికి కూడా సరఫరా చేయలేకపోయేవారు. ఈ విధానం ద్వారా పంపిణీ మా వల్ల కాదని, పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పడం.. ఏదేమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో 15వ తేదీ వరకు కనీసం జిల్లాలో 20 శాతం మంది కార్డుదారులకు కూడా సరకులు పంపిణీచేయలేకపోయారు.
చివరకు క్షేత్ర స్థాయి సాంకేతిక సమస్యలను గుర్తించిన యంత్రాంగం ఈ నెల వరకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రర్)లోనే పంపిణీ చేసేందుకు గ్రీన్‌సిగ్నెల్‌ఇచ్చింది. రెండు రోజుల గడువు పెంచింది. దీంతో 20వ తేదీ నాటికి కిరోసిన్ మినహా మిగిలిన నిత్యావసరాల పంపిణీని పూర్తి చేయగలిగారు. కిరోసిన్‌ను మాత్రం ఈనెల 25వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు గడువు ఇచ్చారు.
కె.కోటపాడు, బుచ్చియ్యపేటల్లో ఒక్కొక్కరికే..
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఈ పాస్ మెషీన్ల ద్వారా 2,09,982 కార్డులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన6,26,548 మందికి పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల పరిధిలో 3,68,496 కార్డుదారులుండగా, కేవలం 86,311 కార్డులకు మాత్రమే ఈపాస్ విధానంలో సరకులు పంపిణీ చేయగలిగారు. మిగిలిన 2,70,419 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేయగలిగారు.
అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, భీమిలి మున్సిపాలిటీలతో పాటు పెందుర్తి, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, ఆనందపురం, పరవాడ మండలాల్లో 274 షాపుల పరిధిలో 4,68,034 కార్డుదారులకు ఈ పాస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా, 1,23,671 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మిగిలిన 3,44,363 కార్డుదారులకు పాతపద్ధతిలోనే పంపిణీ చేశారు. ఈ-పాస్ ద్వారా జీవీఎంసీ పరిధిలో 23.72 శాతం మందికి, ఇతర మున్సిపాల్టీలతో పాటు ఎంపిక చేసిన మండలాల్లో 26.42శాతం మందికి సరకులు ఇవ్వగలిగారు. బుచ్చియ్య పేటలో 272, కె.కోటపాడులో 501 కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం ఒక్కొక్కరికి మాత్రమే ఈపాస్‌ద్వారా పంపిణీ చేయగలిగారు. విశాఖపట్నం రూరల్-2లో కూడా 17 మందికి మాత్రమే పంపిణీ చేశారు.
మెషీన్ల పనితీరుపై టెస్టింగ్ డ్రైవ్
వచ్చేనెలలో ఈ పరిస్థితిని అధిగమించేందుకు గురవారం నుంచి ఈ పాస్ మెషీన్ల పనితీరుపై ప్రత్యేకంగా టెస్టింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరో పక్క ఏజెన్సీలో పరిధిలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఆర్ డిపోల్లో కూడా మే 1వ తేదీ నుంచి ఈ పాస్ ద్వారా సరుకుల పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. తొలినెలలో ఎదురైనా అవరోధాలను అధిగమించేందుకు ఇకనైనా పగడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది.